. . . పులి గోర్లు, దంతాలు స్వాధీనం
ఇందల్వాయి, బతుకమ్మ :
నిజామాబాద్ అటవీ డివిజన్ పరిధిలోని ఇందల్వాయి అటవీ క్షేత్రం, ఆమ్సన్‌పల్లి బీట్, కంపార్ట్‌మెంట్ నెం. 416లో సుమారు మూడు నుండి ఐదు నెలల క్రితం జరిగిన చిరుతపులి వేట ఘటనను అటవీశాఖ అధికారులు విజయవంతంగా ఛేదించరాని ఇందల్వాయి అటవీ శాఖ రేంజ్ అధికారి రవి మోహన్ బట్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, అక్కడ లభించిన ఆధారాలు, సాంకేతిక సమాచారాన్ని విశ్లేషించి, విస్తృత స్థాయిలో దర్యాప్తు చేపట్టాగా విస్తు గొలిపే నిజాలు బయటకు రావడం జరిగిందని రేంజి అధికారి రవి మోహన్ బట్ వెల్లడి చేశారు. దర్యాప్తులో అడవి పందుల వేట కోసం ఏర్పాటు చేసిన ఉచ్చులో ఒక చిరుతపులి చిక్కుకోగా, అనంతరం కొందరు వ్యక్తులు దానిని కర్రలతో కొట్టి చంపినట్లు వెల్లడైందన్నారు. అనంతరం నిందితులు చిరుతపులి మృతదేహాన్ని ధర్పల్లి గ్రామ శివారులోని ఒక మామిడి తోటకు తరలించి, దాని చర్మాన్ని ఒలిచి, నాలుగు పంజాలను వేరు చేసి, మిగిలిన శరీర భాగాలను సమీపంలోని బావిలో పడవేసినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. అటవీశాఖ అధికారులు బావిలో నుంచి కుళ్లిపోయిన చిరుతపులి చర్మాన్ని స్వాధీనం చేసుకుని పశువైద్యాధికారి ద్వారా పరీక్షించగా అది చిరుతపులి చర్మమేనని నిర్ధారణ అయిందన్నారు. దర్యాప్తు సందర్భంగా వేటకు ఉపయోగించిన ఉచ్చులు, వేట సామగ్రి, చిరుతపులి గోర్లు, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఇందల్వాయి అటవీ రేంజ్ అధికారి రవి మోహన్ బట్ వెల్లడించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేయగా, మరో నిందితుడు ఇతర ప్రమేయం ఉన్న వ్యక్తుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఈ ఘటనకు సంబంధించి వన్యప్రాణి (సంరక్షణ) చట్టం, 1972 (సవరణ–2022) తెలంగాణ అటవీ చట్టం, 1967లోని సంబంధిత నిబంధనల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన వివరించారు. నిందితులను న్యాయస్థానంలో హాజరుపరచి రిమాండ్‌కు తరలించడం జరిగిందన్నారు. నిజామాబాద్ జిల్లా, నిజామాబాద్ అటవీ డివిజన్‌లో వన్యప్రాణుల సంరక్షణకు అటవీశాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వన్యప్రాణులను వేటాడడం, వాటి అవయవాలను అక్రమంగా స్వాధీనం చేసుకోవడం, విక్రయించడం లేదా రవాణా చేయడం తీవ్రమైన శిక్షార్హమైన నేరమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తోంది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన వెంటనే సమీప అటవీ అధికారులకు తెలియజేసి వన్యప్రాణుల సంరక్షణలో భాగస్వాములు కావాలని ఇందల్వాయి రేంజ్ అధికారి పిలుపునిచ్చారు.
