. . . ఐద్వా జిల్లా అద్యక్షురాలు అనిత
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా సాధికారిక పై దృష్టి కేంద్రీకరించాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఏ.అనిత అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక నాందేవ్ వాడలోని కార్యాలయం వద్ద గురువారం ఐద్వా జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళల పై జరుగుతున్న దాడులు, హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలతో పాటు, పని ప్రదేశంలో సమాన పనికి సమాన వేతనం కొరకు, అదే విధంగా ఆస్తిలో సమాన వాటా కోసం ఐద్వా అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. ఈ విధంగా కొన్ని హక్కులను సాధించుకున్నామని, అదే విధంగా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సమానత్వం సాధించుకున్నపుడే మహిళలు అభివృద్ధి చెందుతారని, అదే లక్ష్యంతో ఐద్వా మహిళా సాధికారిక కొరకు అనేక ఉద్యమాలు నిర్వహిస్తుందని తెలిపారు. మహిళా సమస్యల పరిష్కారం కొరకు ఐక్య ఉద్యమాలలో మహిళలు కలిసి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు అనసూయమ్మ, శ్రావ్య, సంతోషి, విమలమ్మ, లక్ష్మి, దీపికా, తదితరులు పాల్గొన్నారు.
