27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

పన్ను వసూళ్లపై దృష్టి సారించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
  • నగర పాలక సంస్థ పని తీరుపై సమీక్ష

 

నిజామాబాద్, బతుకమ్మ : పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, వంద శాతం పన్ను వసూళ్లు జరగాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నిజామాబాద్ నగర పాలక సంస్థ పనితీరుపై శుక్రవారం కార్పొరేషన్ కార్యాలయంలో కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్ తదితర ఒక్కో విభాగం వారీగా అమలవుతున్న కార్యక్రమాలను, సాధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్ష జరిపారు. అన్ని విభాగాల మున్సిపల్ అధికారులు, సిబ్బందితో ఆస్తి పన్ను వసూళ్లు, నీటి చార్జీలు, తాగునీటి సరఫరా, శానిటేషన్ పనులు, భవన నిర్మాణాలకు అనుమతులు, క్రమబద్దీకరణ, ఎల్.ఆర్.ఎస్, ఇంజనీరింగ్ పనుల పురోగతి తదితర అంశాలకు సంబంధించిన పనితీరును పరిశీలించిన కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్ను వసూళ్లతో పాటు, పాత బకాయిలు కూడా వసూలు చేయాలని ఆదేశించారు. బిల్ కలెక్టర్లు డిమాండు మేరకు పన్నులు వసూలు చేయాలని, అన్నారు. రోజువారీ వసూళ్ల వివరాలను ప్రతీ రోజు సమీక్షించాలని కమిషనర్ దిలీప్ కుమార్ కు సూచించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలు, సముదాయాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెద్ద మొత్తంలో ఆస్తి పన్ను పెండింగ్ లో ఉంటే, వాటి యజమానులకు నోటీసులు జారీ చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. నోటీసులకు కూడా గడువు లోపు స్పందించకపోతే, అలాంటి వ్యాపార, వాణిజ్య సంస్థలను సీజ్ చేసేందుకు వెనుకాడవద్దని సూచించారు. అదేవిధంగా నీటి చార్జీలు కూడా వసూలు చేయాలని అన్నారు. కొత్తగా గృహ అవసరాలకు నల్లా కనెక్షన్లు మంజూరు చేయాలని, అక్రమ నల్లా కనెక్షన్లు గుర్తించి క్రమబద్ధీకరించాలన్నారు. 100 రోజుల ప్రణాళిక పక్కాగా అమలు జరిగేలా పర్యవేక్షణ చేయాలని అధికారులను కార్యోన్ముఖులు చేశారు. భవన నిర్మాణాలు చేపట్టే వారు నగర ప్రణాళికా విభాగం నుండి తప్పనిసరిగా అనుమతులు పొందేలా చూడాలన్నారు. ఎలాంటి అనుమతులు నిర్మించిన భవనాలకు నిర్ణీత రుసుమును వసూలు చేస్తూ, నిబంధనలకు లోబడి ఉన్న వాటిని క్రమబద్ధీకరించాలని కలెక్టర్ తెలిపారు. శిథిలావస్థకు చేరిన ఇళ్లు, భవనాలను గుర్తించి, తక్షణమే వాటిలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించాలని, వర్షాల వల్ల ఎక్కడ కూడా ప్రాణ నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ హితవు పలికారు.  ఎల్ఆర్ఎస్ కోసం రుసుము చెల్లించిన వారికి త్వరితగతిన ప్రొసీడింగ్స్ అందించాలన్నారు. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, పర్యవేక్షణకు ప్రతీ రోజూ ఉదయం వేళలో పారిశుధ్య సిబ్బంది, శానిటరీ ఇన్స్పెక్టర్లు క్షేత్ర స్థాయిలో విధుల్లో  ఉండాలని, పక్కాగా అటెండెన్స్ తీసుకోవాలని తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణ సమర్ధవంతంగా నిర్వహించాలని తెలిపారు.  నగర పాలక సంస్థ పరిధిలో ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు. వివిధ దశల్లో ఉన్న ఇంజనీరింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో అదనపు కమిషనర్ రవిబాబు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Focus on tax collection

More articles

Latest article