- అడవిని చదును చేయకముందే పోడు పట్టాలు
- స్థానికేతరులకు పోడు పట్టాలపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
- అటవీ అధికారులపై కేసు నమోదు

నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అటవీ భూములు అన్యాక్రాంతమౌతున్నాయి. పోడు చేయకున్నా అటవీ అధికారులే అక్రమంగా అక్రమార్కులకు వంత పాడుతున్నారు. అటవి అధికారుల అక్రమాలపై అధికార యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకున్నా అటవీ భూముల ఆక్రమణలు మాత్రం ఆగడం లేదు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈ తంతు కొనసాగుతూనే ఉంది. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి, సిరికొండ, కామారెడ్డి జిల్లా గాంధారి, మాచారెడ్డి, లింగంపేట్ మండలాల్లో ఇటీవల కాలంలో పోడు భూముల ఆక్రమణలు అటవీ అధికారులపై దాడుల వరకు జరిగిన విషయం విధితమే. తాజాగా ఇందల్వాయి ఫారెస్టురేంజ్ పరిధిలోని ధర్పల్లి మండలం డీబీతాండ (ధనుబాండ్ల తాండ) పరిధికి చెందిన గుగులోత్ పీర్యా అనే గిరిజన రైతు ఫిర్యాదు మేరకు ఇందల్వాయి ఫారెస్టు రేంజ్ అధికారులపై ధర్పల్లి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదయింది. డీబీ తాండ పరిధిలోని నల్లగుట్ట శివారులో ఉన్న 200 ఎకరాల అటవీ ప్రాంతాన్ని కాపాడుతుండగా గతంలో పని చేసిన ఎఫ్ఆర్వో హేమచందన, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ ఆఫీస్, బీట్ ఆఫీసర్ మహ్మద్ ఖదీర్ లు దట్టమైన అటవి ప్రాంతంలో ఎలాంటి పోడు జరుగకపోయినా అనర్హులకు పట్టాలు ఇవ్వడానికి సహకరించారని ఫిర్యాదు చేయడంతో పోలీస్ స్టేషన్ లో ఈ నెల 4న ఎఫ్ఐఆర్ నమోదయింది.
గతేడాది చివరి మాసంలో మాచారెడ్డి మండలంలో అటవి భూముల ఆక్రమణ విషయంలో ఫారెస్టు అధికారులపై దాడి జరుగగా కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో అటవి ప్రాంతంలో కబ్జా విషయంలో అడ్డుకునేందుకు వెళ్లిన అటవి శాఖాధికారులపై దాడి జరిగింది. ఈ విషయంలో దాదాపు 18 మందిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. అదే విధంగా కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం భవానీపేట్ శివారులో అటవి ప్రాంతంలో అక్రమంగా చెట్లు నరికిన వారిపై అటవి శాఖాధికారులు కేసులు నమోదు చేశారు. అయితే అక్కడ స్థానికేతరులకు పోడు పట్టాలు ఇచ్చేందుకే సంబంధిత అటవి శాఖాధికారులు సహకరించారన్నఆరోపణలున్నాయి. గాంధారి మండలంలోని ఇదే మాదిరిగా పోడు భూముల కబ్జా విషయంలో కేసుల నమోదు వరకు వెళ్లాయి.
నిజామాబాద్ జిల్లా సిరికొండ ఫారెస్టు రేంజ్ పరిధిలోని పాకాల సెక్షన్ పరిధిలోని జంగిలోడితాండ బీట్ పరిధిలో జరిగిన అటవి భూముల అక్రమణ వ్యవహరంలో ఏకంగా ఫారెస్టు రేంజర్ వినయ్ తో పాటు వసంత్, మరొకరిని అటవి అధికారులు సస్పెండ్ చేశారు. అటవి భూముల ఆక్రమణకు పోడుకు సహకరించుకున్నారని కలప అక్రమంగా నరికివేత, రవాణాకు సహకరించారన్న కారణాలతో వారిని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని ధర్పల్లి మండలం డీబీతాండ పరిధిలోని నల్లగుట్ట అటవి ప్రాంతంలో పోడు జరుగకున్నా గతంలో పని చేసిన అటవి అధికారులు పోడు పట్టాల కోసం సిఫారసు చేసిన వ్యవహరం కలకలం రేపుతుంది. అటవి అధికారులే కంచె చేను మేసిన విధంగా అటవి భూములను అన్యక్రాంతం చేయడం ఈ విషయంలో కేసులు నమోదు కావడం కలకలం రేపుతుంది. అటవి అధికారులు అటవి సంపదను, భూములను రక్షించకుండా అక్రమార్కులతో మిలాఖత్ అయి భక్షణ చేస్తుండడం కలకలం రేపుతుంది.
