బాన్సువాడ, బతుకమ్మ :
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా మెప్మా, ఎస్ఈఆర్ పి ఆధ్వర్యంలో నిర్వహించిన వారోత్సవాల సందర్భంగా బాన్సువాడ పట్టణం, గ్రామీణ మండలంలోని గ్రామ సంఘాలు, వార్డు సంఘాల అధ్యక్షులు, వీవోఏలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో దోమకొండ, బాన్సువాడ మండలాలకు మంజూరైన మండల మహిళా సమాఖ్య సాముదాయక నిర్వహణ శిక్షణా కేంద్రాలలో బాన్సువాడ మండలానికి కేటాయించిన శిక్షణా కేంద్రాన్ని పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. అనంతరం బాన్సువాడ మండల సమాఖ్య పరిధిలోని 52 మహిళా సంఘాలకు రూ.6 కోట్ల 13 లక్షల ఆర్థిక సాయం చెక్కులను మహిళా సంఘాల అధ్యక్షులకు అందజేశారు. అలాగే ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ పథకం కింద మంజూరైన లబ్ధిదారుల్లో నలుగురికి చెక్కులను పంపిణీ చేశారు. తర్వాత మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయలక్ష్మి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మరో 10 మహిళా సంఘాలకు రూ.2 కోట్ల ఆర్థిక సాయం చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా బాన్సువాడ పట్టణంలోని 18 సంవత్సరాలు పైబడిన అర్హత కలిగిన తెల్ల రేషన్ కార్డు మహిళలకు ఇందిరమ్మ మహిళా శక్తి చీరలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మెప్మా పీడీ శ్రీధర్ రెడ్డి, ఏపిడీ విజయలక్ష్మి, డీపీఎం శ్రీనివాస్‌తో పాటు బాన్సువాడ పట్టణ, గ్రామీణ మండల ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

