27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

ప్రజా సమస్యలపై పోరాడటమే నిజమైన నివాళి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

రాబోయే రోజుల్లో దొడ్డి కొమరయ్య స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాడటమే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రమేష్ బాబు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా శనివారం సీపీఎం జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమేష్ బాబు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు పెద్ద వెంకట రాములు మాట్లాడుతూ, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నిర్మూలన కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దొరల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడుతూ దొడ్డి కొమరయ్య అమరుడయ్యారని పేర్కొన్నారు. ఆయన త్యాగస్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని కొనసాగిన రైతాంగ సాయుధ పోరాటంలో సుమారు 4,000 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, పేద ప్రజలు అమరులయ్యారని తెలిపారు. ఆ పోరాట ఫలితంగా దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేశారని గుర్తుచేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అన్ని కులాలు, అన్ని మతాలకు చెందిన పేద ప్రజలు ఐక్యంగా పాల్గొన్నారని నాయకులు పేర్కొన్నారు. అయితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చారిత్రక పోరాటాన్ని ముస్లిం పాలకులకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంగా చిత్రీకరిస్తూ అమరుల త్యాగాలను వక్రీకరిస్తోందని ఆరోపించారు. మతాల మధ్య, కులాల మధ్య విభేదాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాలు పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. ప్రజల భావోద్వేగాలను రాజకీయాలకు ఉపయోగించుకునే బదులు ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. అయోధ్యలో రూ.2,000 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నప్పటికీ వాటిపై ఎవరూ మాట్లాడడం లేదని పేర్కొంటూ, రాజ్యాంగ పరిరక్షణ అంటే ఏమిటో ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యురాలు సుజాత, నగర నాయకులు అనసూయమ్మ, శంషాద్దీన్, ఉద్ధవ్, దీపిక, సుచిత్, చక్రి తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article