. . . బీజీపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన హామీ మేరకు పూర్తి డబ్బులను ఒకేసారి రైతుల ఖాతాల్లో జమ చేయాలని, లేనిపక్షంలో, తెలంగాణ రైతాంగం పక్షాన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి అన్నారు. రైతు భరోసా పేరుతో తెలంగాణ రైతాంగాన్ని మోసం చేస్తున్న ప్రభుత్వ తీరుపై జిల్లా అధ్యక్షులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ప్రకటనలో ఆయన మాట్లాడుతూ రైతు భరోసా పేరుతో తెలంగాణ రైతాంగాన్ని మళ్లీ మోసం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకం మొదలుపెట్టిందని, సీఎం చేతుల మీదుగా నిధులు విడుదల చేశామంటూ షో చేస్తారు, కానీ రైతుల ఖాతాల్లో డబ్బు పడేది మాత్రం కొన్ని నెలలకు లేదా సంవత్సరాలకు అని, ఇదే కాంగ్రెస్ స్టైల్ అని, ప్రచారం ముందు, ప్రయోజనం తర్వాత.. లేదా అసలు ఉండదని మండి పడ్డారు. వరంగల్ డిక్లరేషన్లో ఎకరానికి రూ.15 వేలు ఇస్తామని ఘనంగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ… అధికారంలోకి వచ్చిన వెంటనే మాట మార్చి రూ.12 వేలు కి పరిమితం చేసిందన్నారు. ఎన్నికలప్పుడు ఒకటి చెప్పి, అధికారంలోకి వచ్చాక ఇంకొకటి చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని బయటపెడుతోందని పేర్కొన్నారు. రైతు భరోసా కింద ఎకరానికి రూ.12 వేలు ఇవ్వాలని ప్రకటించినా, అది సకాలంలో ఒకేసారి రైతుల ఖాతాల్లో జమవుతున్నదా అంటే స్పష్టంగా కాదని, ఇప్పటికీ నాలుగు సీజన్లకు ఎగ్గొట్టిందని వాపోయారు. రైతుకు నిజమైన భరోసా అంటే సకాలంలో, పూర్తి మొత్తంలో సాయం అందించడమని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆలస్యం, కత్తిరింపులు, ప్రచారం అనే మూడు సూత్రాలతో వ్యవహరిస్తోందని, ఇది రైతు సంక్షేమం కాదు. రైతుని నిరాశకు గురి చేసే విధానమని తెలిపారు. రైతుకు అవసరం ఉన్నప్పుడు డబ్బు ఇవ్వాలి గాని, కాంగ్రెస్ ప్రభుత్వానికి సౌకర్యంగా ఉన్నప్పుడు కాదని, ఎన్నికల ముందు హడావుడి చేయడం సరికాదని, రైతుల బాధలతో రాజకీయ లాభం పొందే ప్రయత్నం దారుణమని పేర్కొన్నారు.