29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

నకిలీ కరెన్సీ చలామణి ముఠా గుట్టురట్టు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇద్దరు అరెస్ట్, 8 మందిపై కేసు నమోదు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

నిజామాబాద్ నగరంలోని 5 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ కరెన్సీ చలామణి జరుగుతోందనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు నిర్వహించిన ప్రత్యేక వాహన తనిఖీల్లో ఇద్దరు నిందితులు పట్టుబడ్డారు. ఈ ఆపరేషన్‌ను 5 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సునీల్ ఆధ్వర్యంలో నాగారం చౌరస్తా వద్ద బుధవారం చేపట్టారు. తనిఖీల సందర్భంగా ఒక మోటార్ సైకిల్‌పై వస్తున్న షేక్ కైసర్ (తండ్రి: షేక్ హైదర్), రమేష్ గౌడ్‌ను పోలీసులు నిలిపి తనిఖీ చేశారు. షేక్ కైసర్ వద్ద నకిలీ రూ.500 నోట్లతో పాటు రూ.1,65,000 విలువైన అసలు నగదు, ఐదు మొబైల్ ఫోన్లు, రబ్బర్ బ్యాండ్లు, కవర్లు, ఒక మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా రమేష్ గౌడ్ వద్ద ఖాళీ సిమ్ కార్డ్ పౌచులు, రూ.5,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా, ఈ నకిలీ కరెన్సీ చలామణి వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడిన షేక్ కైసర్, రమేష్ గౌడ్‌లపై చట్టపరమైన చర్యలు పూర్తి చేసి బుధవారం కోర్టులో హాజరుపర్చగా, న్యాయస్థానం వారిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు.

. . . దొంగ నోట్ల చలామణిలో కైసర్ కీలక సూత్రధారి

నిజామాబాద్ 5వ టౌన్ పోలీసులు అరెస్ట్ చేసిన కైసర్ కు పెద్ద నేర చరిత్ర ఉంది.గత కొన్ని సంవత్సరాలుగా నకిలీ కరెన్సీ చలామణిలో కీలక సూత్రధారి. గతంలో మహారాష్ట్ర పోలీసులు కైసర్ ను అరెస్ట్ చేశారు. ఫేక్ కరెన్సీ ద్వారా కైసర్ కొద్ది కాలంలోనే కోట్ల రూపాయలు సంపాదించాడని తెలిసింది. గతంలో పోలీస్ యూనిఫామ్ లో తుఫ్రాన్ లో ఒక లాడ్జిలో పత్తాలాడుతున్న వారిని దోచుకున్న కేసులో కైసర్ కీలక సూత్రధారి గా చెబుతారు. తాను విలేకరి అని ఐడి కార్డుతో దందా చేస్తున్నట్టు ప్రచారం ఉంది.

More articles

Latest article