- కోటగిరి సోసైటిలో బోగస్ రైతుల పేర్లతో 20 లక్షలకు పైగా బోనస్ గాయబ్
- బోనస్ డబ్బులు రికవరీ చేసి సొసైటీలో జమ చేయాలని డిమాండ్
కోటగిరి, బతుకమ్మ : గత ఖరీఫ్ సీజన్ నుండి కష్టపడి వ్యవసాయం చేసే రైతులకు చేయూతనివ్వాలని కేంద్రం ఇచ్చే గిట్టుబాటు ధరతోపాటు రైతులకు లాభం చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాలకు క్వింటాలుకు అదనంగా 500 రూపాయలు బోనస్ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టిన విషయం విదితమే. కానీ పంట చేతికి వచ్చే సమయానికి చెడగొట్టు వానలతో వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడంతో దాదాపు 75 శాతం మంది రైతులు తమ పంటను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో కాకుండా బయట వ్యక్తులకు అమ్ముకున్నారనే విషయం బహిరంగ రహస్యమే. ఇదే అదునుగా భావించిన కోటగిరి సొసైటీ చైర్మన్ బయట వడ్లు అమ్ముకున్న రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో వడ్లు అమ్మినట్లు రికార్డులు సృష్టించి బోనస్ డబ్బులు కాజేశారని కోటగిరి మండల బిజెపి నాయకులు ఆరోపించారు.
కోటగిరి మండల కేంద్రంలో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించిన బిజెపి నాయకులు మాట్లాడుతూ.. రైతులకు రావాల్సిన బోనస్ సొసైటీ చైర్మన్ రైస్ మిల్లర్లు, కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఆరోపించారు. ప్రైవేటు వ్యక్తులకు వడ్లు అమ్ముకున్న రైతుల పేర్లతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో వడ్లు అమ్మినట్లు రికార్డులు సృష్టించి బోగస్ రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు పడేలా చేసి దాదాపు రూ.20లక్షల వరకు బోనస్ డబ్బులు కాజేశారని తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని చెప్పారు. సొసైటీ చైర్మన్ కుటుంబీకుల ఖాతాలో రూ.1.60,000, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్ ఖాతాలో రూ.2,83,000, ఎండి. ఇస్మాయిల్ అనే వ్యక్తి ఖాతాలో రూ. 6,55,000, కాపు గాండ్ల శ్రీనివాస్ ఖాతాలో రూ. 3,05,000, కోటగిరిలో అసలు వ్యవసాయం చేయని జలపురం శ్రావణ్ అనే వ్యక్తి ఖాతాలో రూ.2,10,000, ఎక్కెర్ల శ్రీకాంత్ అనే వ్యక్తి ఖాతాలో రూ.1,35,000 రూపాయలు, ఓ రైస్ మిల్ యజమాని ఖాతాలో రూ.1,82,000 రూపాయల బోనస్ డబ్బులు ఎలా వచ్చాయని వీరంతా వ్యవసాయం ఎక్కడ చేసారని , వారికి వ్యవసాయ భూములు ఎక్కడ అని ప్రశ్నించారు. అసలు వ్యవసాయం చేయని వ్యక్తుల ఖాతాల్లో బోనస్ పడేలా చేసి ప్రభుత్వ సొమ్మును కాజేసిన కోటగిరి సొసైటీ చైర్మన్ పై పూర్తిస్థాయి ఎంక్వయిరీ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కోటగిరి పూర్వపు మండలం లోని సోసైటీలు వివాదాలకు కేంద్రంగా మారాయి. ఇప్పటికే ఎత్తోండ సోసైటీలో రూ. 11 కోట్ల గోల్ మాల్ వ్యవహరం కలకలం రేపింది. పోతంగల్ సోసైటీలో రూ.4 కోట్ల వరకు ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు మురిగి పోయాయి. గతేడాది కాలంలో కోటగిరి మార్కెట్ కమిటీ కి సంబంధించిన గోదాంలలో ధాన్యం లెక్కల వివాదం ఇప్పటికి తేలనే లేదు. తాజాగా కోటగిరి సోసైటీ ద్వారా జరుగని ధాన్యం సేకరణ జరిపినట్లు బోగస్ రైతుల పేరిట బోనస్ ను తమ ఖాతాలలోకి మళ్లించుకున్న వ్యవహరం కలకలం రేపుతోంది. కోటగిరి మండలంలో అధికార పార్టి నేతలే అక్రమాలకు పాల్పడటం తో చర్యలకు వెనుకడుగులు పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. కోటగిరి సొసైటీ కేంద్రంగా జరిగిన బోనస్ బాగోతం ఇటు సొసైటీ సెక్రెటరీ, అటు వ్యవసాయ అధికారులకు తెలియకుండా జరిగిందంటే బిజెపి పార్టీ ఒప్పుకోదని దీంట్లో వాటా ఉన్న ప్రతి ఒక్కరి వద్ద నుండి బోనస్ డబ్బులు రికవరీ చేయించాలని ఆ డబ్బులను సొసైటీ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ పెరుగుతుంది. చిన్న సన్న కారు రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు పగలనకా రాత్రనకా ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే పంట చేతికి వచ్చే సమయానికి వర్షాలు పడుతున్నాయని తడిసిన వడ్లు ప్రభుత్వం ఎక్కడ కొనుగోలు చేయదో అని భయంతో బయట వ్యక్తులకు వడ్లు అమ్ముకుంటే వాళ్ల పేర్లతో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో వడ్లు అమ్మినట్లు పేపర్లు తయారుచేసి బోగస్ రైతుల పేర్లతో బోనస్ డబ్బుల చెల్లింపుల్లో జరిగిన గోల్మాల్ కు సొసైటీ చైర్మన్ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కోటగిరి లో ఉన్న రైస్ మిల్లర్లు సైతం వీరితో చేతులు కలిపి బోనస్ డబ్బుల అవకతవగలకు పాల్పడ్డట్లు తెలిపారు. కోటగిరి లోని జిఎంకే ట్రేడర్స్వి, టల్ సేట్ కు చెందిన సాయి ఆగ్రో రైస్మిల్, ఎక్లాస్పూర్ లోని ఓం సాయి రైస్ మిల్, కోటగిరి లోని ఎస్ఏ ట్రేడర్స్, రైస్మిల్లులు బోనస్ భాగోతంలో ప్రధాన పాత్ర పోషించినట్లు ఆరోపణలు చేశారు.
