- ఈటీఆర్ పేరిట ఎంఈవో రూ.9 వేల వసూల్
- విద్యాశాఖలో వసూళ్ళ దందా
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ విద్యాశాఖలో ఇప్పుడు ఈటీఆర్ లు హాట్ కేకులయ్యాయి. జిల్లా విద్యాశాఖ తరపున కొందరు ఎంఈవోలు వసూళ్ళకు తెగబడుతున్నారు. ప్రతి విద్యా సంవత్సరం సందర్భంగా కొత్త ప్రైవేట్ పాఠశాలల అనుమతులు రెన్యూవల్ లు, ట్రాన్స్ ఫర్లు ప్రాతిపదికగా ఈటీఆర్ లను జారీ చేయడం జరుగుతుంది. దానిని సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు మండల విద్యాశాఖాధికారులు. మొన్నటి వరకు మండల విద్యాశాఖాధికారులు కొందరే పని చేయగా ఇటీవల ప్రభుత్వం సీనియర్ హెడ్ మాస్టార్ లను మండల విద్యాశాఖ ప్రత్యేకాధికారులుగా నియమించిన విషయం తెల్సిందే. అయితే కొందరు ఎంఈవోలు ఈటీఆర్ లను సొమ్ము చేసుకునే వ్యవహరంలో బిజీగా ఉన్నారు. ఈటీఆర్ లకు ఒకప్పుడు రూ.10 వేలు తీసుకుంటే గగనంగా ఉండేది. గతంలో పని చేసిన జిల్లా విద్యాశాఖాధికారికి ఈటీఆర్ లను రూ.20 వేలకు పెంచినట్లు తెలిసింది. జిల్లా విద్యాశాఖాధికారి రూ.20 వేలు అడిగినప్పుడు తామేమి తక్కువగా తిన్నామా అని ఎంఈవోలు రూ.9 వేలు డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. నిజామాబాద్ నగరంలో పని చేస్తున్న ఓ ఎంఈవో ప్రధానంగా ఈటీఆర్ లకే పరిమితమయ్యారని విమర్శలున్నాయి. ఉదయం శాలువాలతో సన్మానం సాయంత్రం దవాత్ లకు కేరాఫ్ గా నిలిచారని ఆరోపణలు మూటగట్టుకున్నారు. గతంలో పని చేసిన డిఈవోకు మధ్యవర్తిగా వ్యవహరించిన సదరు ఎంఈవో ఇప్పుడు విచ్చలవిడిగా వసూళ్ళకు కేరాఫ్ గా నిలిచారని ప్రైవేట్ స్కూల్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా నిజామాబాద్ నగరంలో మైనార్టీ ప్రాంతాల్లో ప్రైవేట్ స్కూళ్ళలో తనిఖీలే లేకుండా ఈటీఆర్ లను కేటాయిస్తున్నారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్ ఎంలు ప్రైమరీ స్కూళ్ళను తనిఖీ చేసి పర్యవేక్షణ చేయకపోవడంతో అక్కడ తరగతులు జరుగడం లేదని వాదనలు లేకపోలేదు. నిజామాబాద్ జిల్లా కేంద్రంగా జరుగుతున్న ఈటీఆర్ లపై ఓ విద్యార్థి సంఘం నేత ఆర్జేడికి ఫిర్యాదు చేయడంతో ఈటీఆర్ ల వసూళ్ళ వ్యవహరం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఒక ఉపాధ్యాయ సంఘం నేత మధ్యవర్తిగా వసూళ్ళు జరుగుతున్నాయని విద్యాశాఖ వర్గాలే కోడై కూస్తున్నాయి. ముదురు ఎంఈవోగా పేరు పడిన సదరు అధికారి వసూళ్ళ వ్యవహరం గతంలో వెలుగులోకి వచ్చిన అప్పటి డిఈవోతో అంటకాగిన సాన్నిహిత్యంతో తప్పించుకున్నాడనే వాదనలున్నాయి. ప్రస్తుతం ఎంఈవో వ్యవహర శైలి కారణంగా ఇతర మండల విద్యాశాఖాధికారులు కూడా ఈటీఆర్ ల కోసం డబ్బులకు ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. విద్యాశాఖ తరపున జారీ అయ్యే ఈటీఆర్ ల వ్యవహరంలో కాసులు దండుకునే వ్యవహరం ఉండడంతో తనిఖీలు లేవని చూసి చూడకుండానే వాటిని జారీ చేస్తుండడంతో జవాబుదారితనం లోపించింది. ఈటీఆర్ ల కోసం సెలవు రోజుల్లోనూ హోటళ్ళలో బైటక్ జరుగుతున్నాయని ప్రచారం ఉంది. మొత్తం మీద ఈటీఆర్ ల వ్యవహరంపై విద్యాశాఖ ఉన్నతాధికారులే విచారణ చేస్తే కానీ బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం లేదని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి.