- ట్రయల్ రన్ పూర్తి
- త్వరలో ప్రారంభానికి కసరత్తు
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కొత్తగా ఇథనాల్ ఫ్యాక్టరి ప్రారంభానికి సిద్దమౌతుంది. అసియా ఖండంలో అతిపెద్ద చక్కెర కర్మగారంగా పేరు గాంచిన దక్కన్ నిజాం షుగర్ ఫ్యాక్టరి (బోధన్) మూతపడి చాలా సంవత్సరాలు అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చక్కెర ఫ్యాక్టరిని తెరిచి రైతులకు, కార్మికులకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ ఇంకా అటకమీదనే ఉంది. కానీ దాని ప్రారంభానికి నిధుల లేమి కొట్టుమిట్టాడుతుంది. ఎన్సీఎస్ఎఫ్ ను తెరిచి చక్కెర ఉత్పత్తి చేసే బదులు ఇథనాల్ ఫ్యాక్టరి నడిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు. అది కార్యరూపం దాల్చలేదు. కానీ కామారెడ్డి జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరి కొత్తగా ప్రారంభానికి పనులు యుద్దప్రాతిపదికన జరుగుతున్నాయి.
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామంలో ఓ ఇథనాల్ ప్రైవేట్ ఫాక్టరీ ప్రారంభంకు సిద్ధం అవుతుంది. మరో 10-15 రోజుల్లో పూర్తి స్థాయిలో ఇథనాల్ ప్యాక్టరీ ప్రారంభించేలా యాజమాన్యం కసరత్తు చేస్తున్నారు. ఇథనాల్ ప్యాక్టరీకి ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు రావడంతో మరో ఫ్యాక్టరీ జిల్లాలో పురుడు పోసుకోనుంది. లింగంపల్లి గ్రామ శివారులో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సేజ్ ఏర్పాటుకు భూసేకరణ చేపట్టింది. ఇక్కడి భూముల్లో తెలంగాణ ఇన్ ఫ్రాస్ట్రాక్చర్ (టీ ఎస్ ఐ ఐ సీ ) ఆధ్వర్యంలో రోడ్లు, విద్యుత్ సౌకర్యాలు కల్పించగా పలు కంపెనీలు దరఖాస్తులు చేసుకున్నారు. ఫుడ్ ప్రాసేసింగ్ యూనిట్, జూట్ మిల్ ఏర్పాటుకు అప్పటి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. అయితే అప్పటి కాంగ్రెస్ నేత ప్రస్తుత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావ్ కోర్ట్ ను ఆశ్రయించగా జూట్ మిల్ ఏర్పాటు వెనక్కి తీసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇథనాల్ ప్యాక్టరీకి దరఖాస్తు చేసుకోగా అనుమతులు రాగా, ఇటీవల ట్రయల్ రన్ నిర్వహించారు.మరికొన్ని రోజుల్లో పూర్తి స్థాయిలో ఫ్యాక్టరి ప్రారంభించేలా చర్యలు చేపట్టారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిర్మల్ జిల్లా దిలావర్ పూర్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట్, గద్వాల్ వద్ద ఇథనాల్ ఫ్యాక్టరిల ఏర్పాటుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దానితో ఆయా జిల్లాల్లో ఇథనాల్ ఫ్యాక్టరిల ఏర్పాట్లను ప్రభుత్వం వెనుకడుగు వేసింది. కామారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఇథనాల్ ఫ్యాక్టరి కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరుగకుండానే పనులు చకచక జరుగుతన్నాయనే వాదనలున్నాయి. పర్యావరణ అనుమతులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, గ్రామ పంచాయతీ అనుమతులు వచ్చాయా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మారింది. అన్ని అనుమతులతో ప్రారంభం చేస్తున్నామని, ఇక్కడి కాలుష్యం రాకుండా చర్యలు తీసుకున్నామని చెబుతున్నా ఎంతవరకు ఉంటుందో తేలాల్సి ఉంది. స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు.
