నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన నిజామాబాద్ జిల్లా విద్యార్థి ఉద్యమ నాయకుడు ఎండల ప్రదీప్ తెలంగాణ ఉద్యమ కారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబడ్డాడు. శనివారం హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు పిడమర్తి రవి ఈ నియామక పత్రాన్ని అందజేశారు. తెలంగాణలో ఉద్యమకారుల కోసం పోరాటం చేసిన వారికి 250 గజాల స్థలాన్ని ఇవ్వాలని, ఆ స్థలాన్ని సాధించుకోవడానికే ఈ తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఏర్పాటు చేశామని పిడమర్తి రవి అన్నారు. నూతనంగా నియామకమైన ఎండల ప్రదీప్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు 250 గజాల స్థలంతో పాటు, ఉద్యమకారులకు గుర్తింపు కార్డు, పెన్షన్ సాధనకై ఉద్యమకారులందరిని ఐక్యం చేస్తామని అన్నారు. తనపై నమ్మకంతో రాష్ట్ర అధ్యక్షుడుగా నియమించిన పిడమర్తి రవి కి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఉద్యమకారుడికి 250 గజాల స్థలం వచ్చేంతవరకు పోరాటం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చైర్మన్ చిర్ర రాజు, రాష్ట్ర కన్వీనర్ రహీం, ఉద్యమకారులు సాయిరాo యాదవ్, జైపాల్ పులి, గొల్లపల్లి రాజాగౌడ్, వాజిద్ తదితరులు పాల్గొన్నారు.
