- పాతవి కాదని, కొత్త సెక్షన్లు చేర్చి…
- ఎమ్మెల్యేలకు తెలియకుండానే సిఎండికి ప్రతిపాదనలు
- స్వార్థ పూరిత ఆలోచనలు తెరపైకి
- డిచ్ పల్లి వైపే కంపెనీ అధికారుల మొగ్గు
నిజామాబాద్, బతుకమ్మ: వినియోగదారుల సౌకర్యార్థం మంజూరైన డివిజన్ కార్యాలయంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఉద్యోగుల స్వార్థ పూరిత ఆలోచనలు తెరపైకి వస్తున్నాయి. డిచ్ పల్లి కేంద్రంగా రెండేళ్ళ కింద డివిజన్ మంజురైతే దానిని అమలు చేయక అలాగే కట్టిపెట్టారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ మధ్యే డివిజన్ విభజన (బైఫరికేసన్) ప్రక్రియను మొదలెట్టారు. అప్పటి మంజూరి ఆధారంగా విభజన జరగాల్సి ఉండగా కొత్తగా నిజామాబాద్ రూరల్ అంటూ ఉద్యోగులు కొత్త రాగం తీస్తున్నారు.
డిచ్ పల్లి కేంద్రంగా డివిజన్….!
విద్యుత్ వినియోగం పెరగడం వల్ల వినియోగదారునికి ఆటంకం కలగకుండా మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పటి ఎంఎల్ఏ బాజిరెడ్డి గోవర్ధన్ డిచ్ పల్లి కేంద్రంగా డివిజన్ కార్యాలయాన్ని 2022లో మంజూరు చేయించారు. దీని పరిధిలో సిరికొండ, గడ్కోల్, జక్రాన్ పల్లి, పడకల్, ధర్పల్లి, ఇందల్ వాయి, ఎల్లారెడ్డిపల్లితోపాటు నిజామాబాద్ రూరల్ పరిధిలోని మోపాల్, రూరల్, బర్దిపూర్ సెక్షన్లు పని చేయాల్సి ఉంటుంది.
నిజామాబాద్ రూరల్ ప్రతిపాదన వెనుక..!
విభజన ప్రక్రియ వేగం అందుకోవడంతో ఉద్యోగులలో ఆందోళన మొదలైంది. డిచ్ పల్లిలో డివిజన్ కార్యాలయం ఏర్పాటు చేస్తే దూర భారం అవుతుందని గ్రహించిన ఉద్యోగులు కొత్తపుంతలు తొక్కుతున్నారు. నిజామాబాద్ రూరల్ అని పేరు పెట్టి డివిజన్ లో వీరికి అనుకూలమైన సబ్ డివిజన్ లను కలపాలని ప్రతిపాదనలను తయారు చేసారు. ఇందులో ముందుగా ఉన్న సిరికొండ, గడ్కోల్, జక్రాన్ పల్లి, పడకల్ లను తొలగించి ఆర్మూర్ డివిజన్ లో చేర్చాలని, నిజామాబాద్ డివిజన్ లో ఉన్న నందిపేట్, నవీపేట్ సబ్ డివిజన్ లను నిజామాబాద్ రూరల్ లో కలపాలనే ప్రతిపాధనలను కంపెనీ సిఎండికి పంపించినట్లు సమాచారం. ఇలా చేయడం భావ్యం కాదేమో అనే సందేహాలు వారిలో కొందరి నుంచి బయటకు రావడంతో, రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నగరంలోనే ఉంది, డివిజన్ ను ఇక్కడ ఏర్పాటు చేస్తే తప్పెంటనే మితండ వాదనలు వినిపించినట్లు తెలిసింది.
ఉద్యోగుల నయా రాగం..!
డిచ్ పల్లి కేంద్రంగా డివిజన్ ఏర్పాటు అయితే క్షేత్ర స్థాయి సిబ్బందితోపాటు రెవిన్యూ విభాగం అక్కడికి వెళ్లి రావాల్సి ఉంటుంది. కాంపౌండ్ వీడలేని ఉద్యోగులు తమ లాగే ఉండాలని భావించారేమో కాబోలు నిజామాబాద్ రూరల్ పేరిట స్థానికంగా డివిజన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయించేందుకు ఉద్యోగులు సమాయత్తం అవుతున్నట్లు తెలుస్తోంది. డిచ్ పల్లి అయితే హెచ్ఆర్ఏ తగ్గుతుందని, కాంపౌండ్ లో ఉంటే అన్ని సౌకర్యాలు అందుతాయని వీరి సౌకర్యార్థం ఆలోచిస్తున్నారు. వినియోగదారుల మేలు గురించి యోచనలు చేయట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విభజన ప్రక్రియలో సీనియారిటీ ననుసరించి ఆయా డివిజన్ లోని సిబ్బంది నుంచి అప్సన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనిలోనూ పక్షపాత ధోరణిని అవలంభిస్తూ బోధన్, ఆర్మూర్ డివిజన్ లోని సిబ్బందిని నూతనంగా ఏర్పడే డివిజన్ కు వచ్చేందుకు అవకాశం కల్పించడం లేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. అప్పట్లోనే విభజన పూర్తి చేసి ఉంటే ఓ అండ్ ఎం సిబ్బందికి మేలు జరిగి ఉండేది. ఇటీవల వీరు పదోన్నతి పొందడంతో ముందు జాబితా నుంచి వెనక్కి రావాల్సి వచ్చింది.
ఎమ్మెల్ల్యేల నుంచి అభ్యంతరాలు రావచ్చు…:
డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటు విషయంలో ఉద్యోగులు అవలంభిస్తున్న తీరును ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు అంతర్గతంగా గమనిస్తున్నట్లు తెలిసింది. ఆర్మూర్ నియోజకవర్గంలో ఉన్న నందిపేట్ సబ్ డివిజన్ లోని నందిపేట్, నూత్ పల్లి, గొట్టుముక్కుల, మాక్లూర్ సెక్షన్లను నిజామాబాద్ రూరల్ లో కలపడమేంటనే ప్రశ్నలు సన్నిహితుల వద్ద చర్చకు వచ్చినట్లు తెలిసింది. విభజన చేయాల్సి వస్తే నిజామాబాద్ డివిజన్ నుంచి తీసివేసి ఆర్మూర్ డివిజన్ లో కలపాలి, లేదంటే అంతే ఉంచాలని ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేకు చెప్పినట్లు సమాచారం.
నిజామాబాద్ రూరల్ లో ఉండాల్సిన గడ్కోల్, సిరికొండ, జక్రాన్ పల్లి, పడకల్ సెక్షన్ లను తొలగించి ఆర్మూర్ లో చేర్చాలని చూస్తే రూరల్ ఎమ్మెల్యే చూస్తూ ఊరుకోరనే సంకేతాలను ఆయన అనుచరులు పరోక్షంగా హెచ్చరికలను జారీ చేస్తున్నారని వినికిడి. డిచ్ పల్లి డివిజన్ ఏర్పాటు చేసింది రూరల్ నియోజకవర్గం కోసమే. అలాంటిది ఇందులోని సెక్షన్ లను ఆర్మూర్ డివిజన్లో కలపాలనే యత్నాలు ఉద్యోగులు ఎలా చేస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉద్యోగులు వారి స్వలాభం కోసం సెక్షన్ లను మార్చాలని చూస్తే పరిణామాలు వేరేలా ఉంటాయనే హెచ్చరికలను వినియోగదారులు జారీ చేస్తున్నారు.
