ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి
బతుకమ్మ, ఆర్మూర్ : జాతీయ సమైక్యతా స్ఫర్తిని ప్రోత్సహించడం “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” లక్ష్యం అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” (ఈ బి ఎస్ బి) పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఆర్మూర్ ఎమ్మెల్యే పైడీ రాకేష్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఫీల్డ్ ఆఫీస్ నిజామాబాద్ ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడీ రాకేష్ రెడ్డి మాట్లాడుతూ,కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఏక్‌భారత్ – శ్రేష్ఠభారత్ పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఆర్ముర్ డిగ్రీ కాలేజ్ లో నిర్వహించడం సంతోషకరమని అన్నారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఈ నెల 28వ తేదీ నుండి 29వ తేదీ వరకు రెండు రోజులు పాటు కొనసాగుతోందన్నారు. దేశ సమైఖ్యత, సమగ్రతను పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్ నిర్వహిస్తుందన్నారు. విద్యార్థులు, యువతల్లో దేశభక్తి, స్వాతంత్ర ఉద్యమం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తుందన్నారు.

బహుమతులు ప్రదానం..
ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” పై నిర్వహించిన వ్యాసరచన, రంగోలి పోటీల్లో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ముఖ్య అతిథిల చేతులు మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. అంతకు ముందు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో కళాకారులు ఒగ్గుకథ నృత్య ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ బి.ధర్మ నాయక్, తెలంగాణ విశ్వవిద్యాలయం యన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ రవీంద్రారెడ్డి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై వేణు ప్రసాద్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయనాధ రెడ్డి, తెలంగాణ మైనారిటీ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ నహీదా ఫిర్దౌస్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల అకడమిక్ డాక్టర్ ఎన్.అంబర్ సింగ్, సీబీసీ ఏపీఏ రషిద్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థిని, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
