. . . రెండు నెలల్లో 294 కేసులు 88 అరెస్టులు
. . . రికార్డు స్థాయి దాడులు
. . . కామారెడ్డి ఎక్సైజ్ శాఖ ఈఎస్ ముకుందా రెడ్డి
కామారెడ్డి, బతుకమ్మ :
ఆబ్కారీ శాఖ లో అవినీతి నియంత్రణ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు కామారెడ్డి జిల్లా మద్యపాన నిషేధ, ఎక్సైజ్ అధికారి ముకుందరెడ్డి తెలిపారు. జిల్లాలో అక్రమ మద్యం, గుడుంబా తయారీ, రవాణా గంజాయి (ఎన్ డిపీఎస్) లాంటి నేరాల నిరోధానికి తమ శాఖ నిరంతరం కఠిన చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. గత జూన్, జులై (2026) రెండు నెలల కాలంలో ఎక్సైజ్ శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టి 294 కేసులు నమోదు చేసి, 88 మంది నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడుల్లో 40.96 కిలోగ్రాముల ఎండు గంజాయి, 2 వాహనాలు, 125 లీటర్ల గుడుంబా, 4,520 లీటర్ల బెల్లం పానకం, 27 లీటర్ల దేశీ దారు, 33 లీటర్ల ఐఎంఎల్ మద్యం, 28 లీటర్ల బీర్, 7.5 లీటర్ల ఎన్డీపీఎస్ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అలాగే 107 కల్లు శాంపిళ్లను సేకరించి, 8 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. శాఖ సమర్థవంతంగా పనిచేయడం వల్లే ఆబ్కారీ రెవిన్యూలో 10 శాతం వృద్ధి సాధించామని అధికారి పేర్కొన్నారు. వీటితో పాటు జిల్లావ్యాప్తంగా మత్తు పదార్థాలపై అవగాహన కల్పించేందుకు 41 రూట్ వాచ్‌లను ఏర్పాటు చేశామని, వనమహోత్సవంలో భాగంగా 41,000 ఈత మొక్కలు నాటామని చెప్పారు. ఇటీవల సలబత్ పూర్ చెక్‌పోస్ట్ ఘటనలో సంబంధిత కానిస్టేబుల్‌పై ఇప్పటికే శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. జిల్లాలో అక్రమ మద్యం, మాదకద్రవ్యాల రవాణాపై సమాచారం ఉంటే ప్రజలు వెంటనే ఎక్సైజ్ శాఖకు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
