. . . 108 మంది విద్యార్థులకు డ్రగ్స్ టెస్టులు, ముగ్గురికి పాజిటివ్!
రంగారెడ్డి, బతుకమ్మ :
హైదరాబాద్ శివారులోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో విద్యార్థుల పార్టీ తీవ్ర కలకలం రేపింది. కమ్మెట గ్రామ సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న పార్టీపై స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటీ), స్థానిక పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక దాడులు చేశారు. చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని కమ్మెట గ్రామ శివారులో ఉన్న ఎల్జీ ఫామ్‌హౌస్‌లో శుక్రవారం ఈ పార్టీ నిర్వహించినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ప్రధాన నిర్వాహకుడు మన్నన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఫ్రెండ్స్, ఫాలోవర్లకు ఈ డ్రగ్స్ పార్టీ గురించి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ జరిగే ప్రదేశం వివరాలను ముందుగానే వెల్లడించకుండా రహస్యంగా ఉంచినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటనతో విద్యార్థుల మధ్య మత్తు పదార్థాల వినియోగంపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.ఈ పార్టీలో సుమారు 108 మంది విద్యార్థులు పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా.. అందులో ముగ్గురికి గంజాయి పాజిటివ్‌గా వచ్చినట్లు వెల్లడించారు. పార్టీ నిర్వహించిన ప్రధాన నిర్వాహకుడు మన్నన్‌తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇక ఈ పార్టీకి హాజరయ్యే వారి నుంచి ఒక్కొక్కరి వద్ద రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఎంట్రీ ఫీజు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. డబ్బులు చెల్లించిన వారికి చివరి నిమిషంలో ఫామ్‌హౌస్ లొకేషన్ పంపించి అక్కడికి రప్పించినట్లు సమాచారం. ఎలాంటి అనుమతులు లేకుండా పార్టీ నిర్వహించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ పార్టీలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
వీరిలో శంకరపల్లి మండలం దొంతన్‌పల్లిలోని ఐబీఎస్ ఇఫ్కాయ్ యూనివర్సిటీకి చెందిన బీబీఏ, ఇంజినీరింగ్ విద్యార్థులు అధికంగా ఉన్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ పార్టీ ప్రధాన నిర్వాహకుడు మన్నన్ గతంలో అదే విద్యాసంస్థలో ఫ్రెషర్స్ డే కార్యక్రమం నిర్వహించిన సమయంలో విద్యార్థులతో పరిచయం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఆ పరిచయాల ఆధారంగా వారిని పార్టీకి ఆహ్వానించినట్లు విచారణలో వెల్లడైనట్లు సమాచారం. ఈ పార్టీలో పలువురు యువతులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.ఫామ్‌హౌస్‌లో పార్టీ జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఎస్ఓటీ, చేవెళ్ల పోలీసులు సంయుక్తంగా దాడులు చేపట్టారు. పోలీసులను చూసి కొందరు విద్యార్థులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విద్యార్థులకు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో ప్రధాన నిర్వాహకుడు మన్నన్‌తో పాటు మరో ఇద్దరికి గంజాయి పాజిటివ్‌గా వచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఈ పార్టీకి గంజాయి ఎలా చేరింది.. ఎవరు సరఫరా చేశారు.. విద్యార్థులకు మత్తు పదార్థాలు అందించడంలో మరెవరైనా ఉన్నారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఫామ్‌హౌస్‌లో భారీగా మద్యం బాటిళ్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ పార్టీ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ఎవరు చేశారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఎంట్రీ ఫీజు రూపంలో వసూలు చేసిన డబ్బులు ఎవరికి చేరాయి.. ఫామ్‌హౌస్‌లో ఇలాంటి కార్యక్రమాలు గతంలోనూ జరిగాయా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఫామ్‌హౌస్ యజమాని పాత్ర, పార్టీ నిర్వహణకు అనుమతులు ఉన్నాయా అనే వివరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇటీవల రంగారెడ్డి జిల్లా పరిధిలోని పలు ఫామ్‌హౌస్‌లపై పోలీసులు తనిఖీలు నిర్వహించిన నేపథ్యంలో తాజాగా చేవెళ్లలో వెలుగుచూసిన ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసు విచారణ పూర్తయితే ఈ పార్టీ వెనుక ఉన్న మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఒకపక్క తెలంగాణ ప్రభుత్వం.. మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేందుకు ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్ విభాగాన్ని ఏర్పాటు చేసి మరీ రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేస్తున్న వేళ.. ఇలాంటి భారీ డ్రగ్స్ పార్టీ జరగడం తీవ్ర దుమారం రేపుతోంది.

