- నగరంలో ఆక్రమణల తొలగింపునకు అడ్డంకులు
- మైలేజి కోసం పార్టీల తహతహ
- నగర అభివృద్ది కోరే వారే లేరా?
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీసు కోత్వాల్ గా పోతరాజు సాయిచైతన్య బాధ్యతలు తీసుకున్న తర్వాత నగరంపై ద`ష్ఠి సారించారు. ప్రధానంగా నగరం విస్తీర్ణం అవకాశం ఉన్నప్పటికీ ఆ స్థాయిలో డెవలప్ మెంట కాకపోయినా పెరిగిన జనాభాకు అనుగుణంగా రోడ్ల వెడల్పు లేకపోవడం ట్రాఫిక్ జంక్షన్ ల వినియోగం, ఐదారు సిగ్నళ్ళకే పరిమితమైన విషయాన్ని గుర్తించారు. ప్రధానంగా నగరంలో ఫుట్ పాత్ లేకుండాపోవడంతో ఈ సమస్య పరిష్కరించడానికి సీపీ నడుం భిగించారు. అందులో భాగంగా నిజామాబాద్ నగరంలో తొలిసారిగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఫుట్ పెట్రోలింగ్ చేపట్టారు. అదే విధంగా నగరంలో ట్రాఫిక్ సమస్యకు కారణమైన ఆక్రమణలను తొలగించాలని నిర్ణయించారు. నిజామాబాద్ జిల్లా అడిషనల్ మేజిస్ట్రేట్ హోదాతో ఫుట్ పాత్ ల ఆక్రమణలు తొలగించే పనిని చేపట్టారు. అయితే నగరంలో అవాంతరాలు ఏర్పడుతున్నాయి. ఈ నెల 18న నగరంలోని కుమార్ గల్లిలో చేపట్టిన ఆక్రమణల తొలగింపు స్థానిక వ్యాపారుల నుంచి వ్యతిరేకత వచ్చింది. అందుకు కారణం వారు ఫుట్ బోర్డు(డ్రైనేజీ)పైనే అదనపు దుకాణాలను ఏర్పాటు చేసి కనీసం ద్విచక్ర వాహనం వెళ్ళకుండా కబ్జా చేయడంతో పోలీసు శాఖ కన్నెర్ర చేసింది. అక్కడి నుంచి ట్రాఫిక్ పోలీసులు, లోకల్ పోలీసులు అహ్మదీబజార్ ప్రాంతంలో ఆక్రమణలను తొలగించేందుకు యత్నించగా స్థానిక చిరు వ్యాపారులు అడ్డుకున్నారు. వారికి మజ్లీస్ పార్టీ లీడర్లు వెన్నుదన్నుగా నిలిచారు. ఏకంగా పోలీసు అధికారుల విధులకు ఆటంకం కలిగించారు. రోడ్డును ఆక్రమించి దందాలు చేస్తున్న వారికి ప్రత్నామ్నాయం చూయించి ఆక్రమణలు తొలగించాలని పెట్టిన డిమాండ్ పోలీసు అధికారులు కన్నెర్ర చేశారు. ఫుట్ పాత్ లను , రోడ్డులను ఆక్రమించి వ్యాపారం చేయడం నేరమని, సిటీ పోలీసు యాక్టుకు వ్యతిరేకంగా విధులను అడ్డుకున్న ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. స్థానికంగా ఓ ప్రార్థన మందిరాన్ని ఆనుకుని ఉన్న ఆక్రమణలను తొలగించారు.

నిజామాబాద్ నగరానికి వందేళ్ళ చరిత్ర ఉంది. మున్సిపాలిటీగా రూపాంతరం చెంది 90 సంవత్సరాలు గడిచాయి. 2004లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గా అప్ గ్రేడ్ అయింది. కానీ నగరం విస్తీర్ణం మాత్రం 5 కిలో మీటర్ల పరిధికే పరిమితమైంది. అందుకు కారణం మాస్టర్ ప్లాన్ లేకపోవడమే. 1973లో ఆనాటి పాలకులు పెట్టిన మాస్టర్ ప్లానింగ్ నేటికి అమలవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మూడు కోట్ల రూపాయల వ్యయంతో నూతన మాస్టర్ ప్లాన్ అమలుకు చేసిన ప్రయత్నం డ్రాప్ట్ ప్లాన్ (ముసాయిదా) వరకే పరిమితమైంది. దానితో తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ తర్వాత అతిపెద్ద చారిత్రాత్మక నగరం కుచించుకపోతుంది. అక్రమ కట్టడాలను బల్ధియా అధికారులు నియంత్రించలేకపోతున్నారు. అదే సమయంలో ఫుట్ పాత్ ల ఆక్రమణతో నగరం ట్రాఫిక్ సమస్యకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. స్థానికంగా లీడర్లు తమకు ఆదాయ వనరుగా ఫుట్ పాత్ లను, రోడ్డు ఆక్రమ వ్యాపారులను మలచుకున్నారన్న ఆరోపణలున్నాయి. నెల వారీగా డబ్బులు వసూల్ చేసుకుని తోపుడు బండ్ల ఏర్పాట్లతో పాటు చిరు వ్యాపారులకు అండగా నిలిచారు. అయితే పోలీసు శాఖ ఆక్రమణలను తొలగించేందుకు సిద్దం కావడంతో పొలిటికల్ వ్యాపారులు తమకు మైలేజ్ రావాలని ప్రజలను రెచ్చగొట్టే పని చేస్తున్నారు.
నిజామాబాద్ నగరం పేరుకే పురాతన నగరంగా మిగిలిపోతుంది. హైదరాబాద్ లోని పాత బస్తీకి ఏ మాత్రం తీసుపోని విధంగా రోడ్ల పరిస్థితి ఉంది. నగరాన్ని అభివృద్ది చేయాలన్న తలంపు లీడర్లకు లేకుండాపోయింది. కేవలం తమ రాజకీయ పబ్బం గడుపుకునేందుకే మాస్టర్ ప్లాన్ ఎన్నికల వేళ హామీగా మారింది. నగరంలో స్వచ్చంద సంస్థలు, నగరాభివ`ద్దిని కోరే వారే కరువయ్యారని వాదనలు వినిపిస్తున్నాయి. నగరంలో పోలీసు శాఖ ఆక్రమణల తొలగింపును చేపట్టి ప్రజల సౌకర్యార్థం సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తుంటే వారికి వెన్నుదన్నుగా నిలువాల్సిన సమయం ఆసన్నమైంది. కొందరు ప్రముఖులు కేవలం ప్రకటనలకే పరిమితమవ్వడం మినహాయించి కార్యక్షేత్రంలో సిటీ డెవలప్ మెంట్ అనే విషయాన్ని పట్టించుకోవడం లేదన్న వాదనలున్నాయి. నగరంలో కొన్ని సంస్థలు ఎన్జీవోల ఆధ్వర్యంలో నడుస్తున్నప్పటికీ అందులో సొంత ప్రయోజనం కుటుంబ వ్యాపార ప్రయోజనాలే ఎక్కువ అన్న వాదనలున్నాయి. పోలీసు కమిషనర్ సాయి చైతన్య ధైర్యంగా ముందుకు వచ్చి ఆక్రమణలు తొలగిస్తుంటే అడ్డుకునేందుకు రాజకీయ నాయకులు చిరు వ్యాపారులను రెచ్చగొడుతున్న వ్యవహరాన్ని పట్టించుకోకపోతే నగర అభివృద్ది కలే అనే చర్చ జరుగుతుంది. అటు పొలిటికల్ లీడర్లు పట్టించుకోకపోయినా ప్రజాప్రతినిధులు పట్టనట్లు వ్యవహరిస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం ప్రజల శ్రేయస్సు కోసం ముందుకు వస్తుండగా వారికి మద్దతు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది.

