- ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ కు 3500 నుండి 4000 ఇందిరమ్మ ఇండ్లు
- యావత్ దేశానికి ఆదర్శంగా నిలువనున్న నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
నిజామాబాద్, బతుకమ్మ : దసరా కానుకగా నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు తీరుపై రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రోడ్లు – భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడారు. జిల్లాలో ధరణి దరఖాస్తుల పరిష్కారం, రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాల ప్రగతి, ఎల్.ఆర్.ఎస్, విద్య, వైద్యారోగ్య శాఖల పనితీరు, ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలెట్ సర్వే తదితర అంశాల అమలు తీరు గురించి కలెక్టర్ మంత్రుల దృష్టికి తెచ్చారు. ధరణి దరఖాస్తులను పరిష్కరించే విషయంలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ చూపడం ప్రశంసనీయమని ప్రభుత్వం పక్షాన అభినందనలు తెలియజేశారు. అయితే, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి కూడా ఇదే తరహాలో చొరవ చూపుతూ, వాటిని తక్షణమే పరిష్కరించాలని సూచించారు. ఇప్పటికే పూర్తయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను విజయదశమి కానుకగా అర్హులైన వారికి కేటాయించేందుకు గాను జిల్లా ఇంచార్జి మంత్రి పర్యవేక్షణలో నిరుపేదలను లబ్ధిదారులుగా ఎంపిక చేయాలని తెలిపారు. లబ్ధిదారుల ఎంపికకు త్వరలోనే ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయనుందని అన్నారు. నీటి వసతి, విద్యుత్ సౌకర్యం, శానిటేషన్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉండేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని, ఈ పనుల కోసం అవసరమైన నిధులను కూడా కేటాయించడం జరిగిందని గుర్తు చేశారు. వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్న అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా రెండుమూడు నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే నిరుపేదల రాజ్యం అని స్పష్టం చేసిన మంత్రి పొంగులేటి, అర్హులైన వారికి తొలి విడతగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రభుత్వం త్వరలోనే 3500 నుండి 4000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయనుందని ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ కారణంగా రైతులు అభద్రతా భావానికి గురి కావాల్సి వచ్చిందని మంత్రి పొంగులేటి ఆక్షేపించారు. ధరణి ఇబ్బందులను అధిగమించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తమ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని సంప్రదించి, మేధావులు, నిపుణుల అభిప్రాయాలు, సూచనలను పరిగణలోకి తీసుకుని సమగ్రంగా నూతన ఆర్.ఓ.ఆర్ చట్టాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. ఈ నెలాఖరులోపు అమలులోకి రానున్న నూతన ఆర్.ఓ.ఆర్ చట్టం యావత్ దేశానికే ఆదర్శంగా నిలువబోతోందని అన్నారు. రెవెన్యూ చట్టాలలో మార్పులు చేయాలనుకునే ఇతర రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్ర కొత్త ఆర్.ఓ.ఆర్ యాక్టు ఖురాన్, భగవద్గీత, బైబిల్ గా ఉపకరిస్తుందని వ్యాఖ్యానించారు.
విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నందున, వీటి పనితీరును మెరుగుపరుచుకుని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని హితవు పలికారు. విద్య, వైద్య శాఖల్లో సమస్యల పరిష్కారానికి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం తరపున తక్షణ సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో వైద్యుల ఖాళీలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆలోపు కాంట్రాక్టు పద్ధతిన డాక్టర్లను నియమించుకుని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. పాఠశాలల్లో మౌలిక వసతులను మెరుగుపర్చేందుకు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ద్వారా రూ. 637 కోట్ల నిధులను ఖర్చు చేసిందని వివరించారు.
ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా పరిరక్షించాలి..
కాగా, ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురికాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. కబ్జాలకు పాల్పడిన వారు ఏ స్థాయిలో ఉన్నా సరే, వారి నుండి సర్కారు భూములను స్వాధీనం చేసుకుని వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి ప్రత్యేక గుర్తింపు కార్డు అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీ కోసం పైలెట్ సర్వే నిర్వహిస్తోందని తెలిపారు. వచ్చే జనవరి నెల నుండి రేషన్ షాపుల ద్వారా అందించనున్న సన్న బియ్యం పంపిణీతో పాటు, ఇందిరమ్మ ఇళ్ళు, ఉచిత విద్యుత్, రూ. 500 లకు వంట గ్యాస్, రాజీవ్ ఆరోగ్య శ్రీ వంటి అన్ని పథకాలకు భవిష్యత్తులో ఫ్యామిలీ డిజిటల్ కార్డు ప్రామాణికంగా నిలుస్తుందని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టు సందర్భంగా క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని పరిష్కరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అందరికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రూపొందించబడిన డిజిటల్ కార్డులను అందించడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు. నిరుపేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి, సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్న తమ ప్రభుత్వానికి ప్రతిపక్షాలు విలువైన సూచనలు అందిస్తూ పాలనలో భాగస్వాలుము కావాలని పిలుపునిచ్చారు. సమీక్షా సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు వేంనరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, బోధన్ ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి చేరుకున్న మంత్రులకు హెలీప్యాడ్ వద్ద కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ ఈరవత్రి అనిల్, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్, ఐడిసిఎంఎస్ చైర్మన్ తారాచంద్, అదనపు కలెక్టర్లు అంకిత్, ఎస్.కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
