నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ జిల్లా చందూర్ మండలం కారేగాం తండా కు చెందిన రమావత్ లాల్ సింగ్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్ ప్రకటించింది. 2018 వ సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పి.హెచ్.డి సీటు సాధించి భారత దేశం స్వాతంత్య్రం అనంతరం దేశంలోని సంస్కృతి సంప్రదాయాల మధ్య జరుగుతున్న ఘర్షణ పై పరిశోధన చేశారు.ఉస్మానియా విశ్వవిద్యాలయంహిందీ విభాగంలో సమకాలిన్ హిందీ ఉపన్యాస్ మే ఎక్ సాంప్రదాయక్ సంఘర్ష్ (1950 -2000) అనే అంశంపై ఆయన సిద్ధాంత గ్రంథాన్ని రూపొందించారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో నిర్వహించిన ఓపెన్ వైవావోస్‌లో రిటైర్డ్ ప్రొఫెసర్ అవినాష్ జైస్వాల్ పర్యవేక్షణలో పీహెచ్డీ విజయవంతంగా పూర్తి చేశారు. ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్ ప్రొఫెసర్ జయ కిషన్, నాంపల్లి మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ చంద్ర ముఖర్జి సంతృప్తి వ్యక్తం చేశారు.చందూర్ మండలం నుంచి ఆర్ట్స్ విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ మొదటి డాక్టరేట్ పట్టా పొందారు.ఈ సందర్భంగా అధ్యాపకులు, పరిశోధకులు, గ్రామస్తులు ఆయనకు అభినందనలు తెలిపారు. రమావత్ లాల్ సింగ్ గిరిరాజ్ డిగ్రీ కళాశాల లో రెండు డిగ్రీలు, తెలంగాణ విశ్వవిద్యాలయం లో ఎం.ఏ ,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం లో మాస్టర్ లైబ్రరీ సైన్స్ పూర్తి చేసారు.

తెలంగాణ మళిదశ ఉధ్యమంలో లాల్ సింగ్….
తెలంగాణ రాష్ట్రం కోసం 2009లో జరిగిన మలి దశ ఉద్యమం లొవిద్యార్థి సంఘాల పాత్ర కీలకమైంది. ఆ తరం విద్యార్థుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవాడు తెలంగాణ విద్యార్థి ఉధ్యమ వేదిక విద్యార్థి సంఘం నాయకుడు లాల్ సింగ్.రోజూ రాత్రింబవళ్లు విశ్వవిద్యాలయాలు, కాలేజీలలో తెలంగాణ రాష్ట్రం కోసం ఆందోళనలను నడిపిస్తూ, విద్యార్థులను ఒకే జెండా కింద చేర్చడంలో ఆయన ముఖ్య పాత్ర పోషించాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కేవలం రాష్ట్ర స్థాయిలోనే కాక, జాతీయ స్థాయిలోనూ మద్దతు అవసరమని గ్రహించి, లాల్ సింగ్ ఢిల్లీకి వెళ్లాడు. అక్కడ ఆయన అప్పటి పార్లమెంట్ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ ను కలిశాడు. మాకు ప్రత్యేక తెలంగాణ అవసరమని, ఇది కేవలం రాజకీయ ఆవశ్యకత కాదు, కోట్లాది ప్రజల కల అని లాల్ సింగ్ ధైర్యంగా వివరించాడు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు, ఆ విజయ గాథలో లాల్ సింగ్ వంటి విద్యార్థి నాయకుల కృషి, త్యాగం వెలుగులో నిలిచింది. ఆయన పేరు విద్యార్థి ఉద్యమాల చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయింది.
