. . . జిల్లాలో రైతుల నిలువు దోపిడి
. . . సొసైటీలు . . . మిల్లర్ల మిలాఖాత్ ను అడ్డుకునే వారేరి
. . . కష్టకాలంలోనూ కర్షకులకు తుకాల పేరిట దోపిడి
నిజామాబాద్, బతుకమ్మ :
కల్లాలలో ధాన్యం తూకం వేసి నెల రోజులు గడిసింది. లారీలు లేవు.. బస్తాలను ఎత్తుదామంటే హమాలీలు లేరు. అసలే చెడగోట్టు వానలు రైతులను అతలాకుతలం చేస్తున్నాయి. దానితో రైతులు ధాన్యం కాంటాలను నిర్వహించిన వాటిని మిల్లింగ్ కోసం రైస్ మిల్లులకు తరలించండి మహాప్రభో అని నెత్తినోరు మొత్తుకుంటున్నారు. కానీ ధాన్యం తరలింపులో మాత్రం ఆలస్యం అవుతుంది. కానీ ఇదే సమయంలో సొసైటీల వద్ద తరుగు పేరిట దోపిడి జరుగుతుంది. ధాన్యం బస్తా కోసం 5 నుంచి 7 కిలోల తరుగు తీస్తున్నారు. తరుగు లేకుండా సొసైటీ కాంటాలను నిర్వహించిన మిల్లర్లు మాత్రం దించుకునేందుకు (అన్ లోడింగ్) కు ససేమీరా అంటున్నారు. కొన్ని చోట్ల మిల్లర్లు, సొసైటీల కార్యదర్శులు ముందే మాట్లాడుకుంటుండటంతో ధాన్యం కాంటాల వద్దనే తరుగు తీసి మరీ కాంటాలను చేస్తున్నారు. సొసైటి వద్ద బస్తాకు 40 కిలోల బరువును తూకం వేస్తే, ధర్మకాంటాల వద్ద మాత్రం అందులో తూగిన మిగులును వాటాలుగా చేసుకుని పంచుకుంటున్నారనే వాదనలు లేకపోలేదు.

మోపాల్ మండలం కస్బాగ్ తాండాకు చెందిన ఆరుగురు రైతులు మోపాల్ సొసైటి ద్వారా కాంటాను ఈ నెల 19న నిర్వహించారు. అందులో కేవలం 790 బస్తాలను రాసుకున్నారు. కానీ ధర్మకాంటాకు వచ్చే సరికి బస్తాకు కేవలం 40 కిలోల చోప్పున 298 క్వింటాళ్లకు లెక్కలు వేశారు. మోపాల్ సొసైటి కొనుగోలు చేసిన ధాన్యం రూరల్ మండలం మల్కాపూర్ (జే) లో గల రైస్ మిల్ కు అలాట్ చేయగా రైతులు మిల్లర్ ను అడిగెందుకు ప్రయత్నిస్తే సోసైటిలోనే తెల్చుకోవాలని సమాధానం వచ్చిందంటా. అదే విధంగా ధర్పల్లి మండలం డీబీ తాండాకు చెందిన బాలరాజు అనే రైతు తన ధాన్యం తూకంలోనే బస్తాకు 5 కిలోల తరుగు తీశారని వాపోయారు. గత 15 రోజులుగా కాంటాలు జరుగుతాలేవు, తూకం వేసిన ధాన్యం తరలించడం లేదని రైతులు అందోళన చెందుతుంటే సోసైటిలు, మిల్లర్లు మిలాఖాత్ అయి రైతులను తరుగు పేరిట దోచేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తాలు (తర్ర) పేరిట, కడ్తా పేరిట రైతులు పండించిన ధాన్యంలో తూకం వేసేందుకు కమీషన్ రూపంలో బహిరంగ వసూల్ కల్చర్ ఉంది. ప్రభుత్వాలు మారినా . . . పాలకులు మారినా రైతులను దోచే దందా మాత్రం ఆగడం లేదు. రైతులు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని పట్టించుకోకుండా కడ్తా పేరిట జరుగుతున్న అదనపు వసూళ్ల వ్యవహరంలో జిల్లాలో అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సోసైటిలు, మిల్లర్ల దోపిడి మాత్రం అగడం లేదు..

రైతులకు ప్రభుత్వం ఇచ్చే మద్ధత్తు ధర దక్కాలన్న, ప్రభుత్వం క్వింటాల్ కు ఇచ్చే సబ్సిడి పొందాలంటే సోసైటిల ద్వారా జరుగు కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలి. రైతులు మిల్లర్లకు, ప్యాడి క్యాన్వసింగ్ ఏజంట్ల దోపిడి తట్టుకునేందుకు సోసైటీలకు అమ్మితే తరుగు పేరిట దోపిడి అందోళన కలిగిస్తుంది. నిజామాబాద్ జిల్లాలో ఆదివారం వరకు 6.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. ఇంకా పది వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించాల్సి ఉందని అధికారులు చెబుతున్నా తరుగుపై అధికారులు, పాలకులు నోరు మోదపడం లేదు. ప్రతి సారి పంటలు పండించినప్పుడు ప్రభుత్వం, అధికార యంత్రాంగం తాలు( తర్ర) పేరిట తూకంలో కోతలు , కడ్తా ఉండవద్దని పాఠం చెబుతున్నా సోసైటిలకు, మిల్లర్లకు చెవికి ఎక్కడం లేదు. యాసంగీ సీజన్ లో దిగుబడి మంచిగా వచ్చిందని సంబర పడేలోపే ప్రభుత్వం ధాన్యం కోనుగోళ్లు అలస్యం చేయడంపై రైతులు అందోళన వ్యక్తం చేస్తుంటే సందట్లో సడే మియా అన్న చందంగా రైతులనుంచి బస్తాకు 5 కిలోల వరకు క్వింటాల్ కు 9 నుంచి 11 కిలలో తరుగు తీస్తున్నా ఇప్పటి వరకు ఒక్కరిపై చర్య తీసుకోలేదని రైతులు చెబుతున్నారు.

