28.5 C
Hyderabad

ఫీజు బకాయిల పేరుతో టి.సీ.లు నిలిపివేయొద్దు

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఫీజు బకాయిల పేరుతో విద్యార్థుల టి.సీ. (ట్రాన్స్‌ ఫర్ సర్టిఫికెట్), ఇతర విద్యా ధ్రువపత్రాలను నిలిపివేయడం, టి.సీ. జారీకి అదనపు రుసుములు వసూలు చేయడం వంటి ఆరోపణలపై నిజామాబాద్ నగరంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి ప్రతినిధులు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. గంగాస్థాన్ ప్రాంతంలోని ఎస్సార్ కళాశాలతో పాటు మరికొన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అధిక ఫీజుల వసూళ్లు, తగిన ఫ్యాకల్టీ లేకపోవడం, విద్యా మౌలిక సదుపాయాల కొరత వంటి అంశాలపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయని సమితి ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా టి.సీ. జారీకి రూ.200 చార్జీ పేరుతో రుసుము డిమాండ్ చేయడం, ఫీజు బకాయిల కారణంగా విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేయడం వంటి అంశాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ సందర్భంగా వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, నిజామాబాద్ జోనల్ కన్వీనర్ సందు ప్రవీణ్, ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి అధ్యక్షుడు పెందోట అనిల్ కుమార్, ఉపాధ్యక్షుడు వి.ఎన్. వర్మ, రూరల్ అధ్యక్షుడు యాటకర్ల దేవేష్ తదితరులు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని కలిసి ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు. ఫీజు సంబంధిత వివాదాల కారణంగా విద్యార్థుల విద్యా భవిష్యత్తుకు ఇబ్బంది కలగకుండా, టి.సీ., విద్యా ధ్రువపత్రాలు లేదా ఇతర అవసరమైన పత్రాలను నిలిపివేయకుండా కళాశాల యాజమాన్యాలు నిబంధనల ప్రకారం వ్యవహరించేలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ప్రతినిధులు కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేసే విధానాలను అరికట్టాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల హక్కులు, విద్యా భద్రత, తల్లిదండ్రుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే సంబంధిత కళాశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇందూర్ వినియోగదారుల సంక్షేమ సమితి ప్రతినిధులు డిమాండ్ చేశారు.

More articles

Latest article