. . . నీటిని,విద్యుత్‌ను పొదుపుగా వాడుకునే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలి
. . . పంటలు వేయకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే
. . . ప్రభుత్వ రాష్ట్ర ముఖ్య సలహాదారులు బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి
నిజామాబాద్ , బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్రంలో ఎల్‌నీనో ప్రభావం తీవ్రంగా వుండడం వల్ల వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో వున్న ప్రధాన ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువులు, కుంటల్లో కావల్సినంత నీరు నిల్వలు లేక పోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయాయని రాష్ట్ర ముఖ్య సలహాదారులు బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి తెలిపారు. దీనిపై అవసరమైన కార్యచరణ అమలు చేయడానికి ముఖ్యంగా పంటలు తాగునీరు, విద్యుత్ వంటి కీలక సమస్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారని రాష్ట్ర ముఖ్య సలహాదారులు బోధన్ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ముఖ్యంగా సింగూరు ప్రాజెక్టు కేవలం తాగు నీరు కోసమే ఉపయోగ పడుతుందన్నారు. అలాగే నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టలో ఆశించిన స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లేక పోవడం వల్ల రైతులు, ప్రజలు విద్యుత్‌ను సాగునీరు, తాగు నీరును పొదుపుగా వాడుకోవాలని సూచించారు. సింగూరు ప్రాజెక్టు నుండి డిసెంబర్ 2026 వరకే నీరు అందుబాటులో ఉన్నాయని, సింగూరు ప్రాజెక్టు క్రింద ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు. నిజామాబాద్ జిల్లాలోని ప్రజలకు ఎలాంటి తాగునీటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. ఎక్కడ కూడా నీటి సరఫరాలో లీకేజీలు లేకుండా నీరు వృదా కాకుండా అధికారులు వాటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు పొదుపుగా వాడుకోవాలని చెప్పారు. ఎల్‌నీనోతో రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభం నెలకొందని ఈ ధృష్ట్యా ఈ రబీ సీజన్లో ఎలాంటి పంటలు వేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు. ఎల్‌నీనో పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో తాగడానికి నీరు దొరకడం లేదు కొందామన్న విద్యుత్ దొరకడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో పంటలు వేస్తే పరిస్థితులు మరి దారుణంగా వుండే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో అధికారులు ముఖ్యంగా సాగునీటి శాఖ, వ్యవసాయ శాఖ, విద్యుత్ శాఖ, ఎంపిడీవోలు,ఎంఅర్ఒలు రైతులను, ప్రజలకు అవగాహన కల్పంచేందుకు ప్రత్యేక కమిటీలు వేస్తూ గ్రామ పంచాయతీల ద్వారా దండోరా వేయించి అవగాహన కల్పించాలని సుదర్శన్ రెడ్డి కోరారు. ప్రాజెక్టులలో నీరు లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గిపోయింది. ప్రస్తుతం పూర్తిగా సోలార్ విద్యుత్ ఉత్పత్తినే వాడుతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌నీనో ప్రభావాన్ని గుర్తించిన రైతులు ప్రజలు పంటలు వేయకుండా సాగునీరు, తాగునీరు పొదుపుగా వాడుకునేందుకు ప్రభుత్వానికి అధికార యంత్రాంగానికి సహకరించాలని సుదర్శన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
