గోడ కూలి 8 మంది భక్తులు మృతి
సింహాచలం, బతుకమ్మ : విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. స్వామి వారి నిజ రూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో ఎనిమిది మృతి చెందారు. నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సింహాచలంలో భారీ వర్షం కురియడంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువకు వెళ్లే మార్గంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద రూ.300 టికెట్ క్యూలైన్ పై సిమెంట్ గోడ కూలింది. వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అధికారులు, సహాయక చర్యలు చేపట్టారు. హోం మంత్రి వంగలపూడి అనిత, విశాఖ కలెక్టర్ హరేంధిర ప్రసాద్, సీపీ శంఖబ్రత బాగ్చీ ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మృతదేహాలను కేజీహెచ్ కు తరలించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

