. . . జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని డి. పద్మ అనిల్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
వైకల్యం అనేది శరీరానికే కానీ మనిషి మేధస్సుకు కాదని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని డి.పద్మ అనిల్ తెలిపారు. ఎంతోమంది స్నేహ సొసైటీ దివ్యాంగ విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించడం మనిషి మేధస్సుకు నిదర్శనం అన్నారు. జిల్లా కేంద్రంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ దివ్యాంగ పాఠశాల ఆవరణలో జాతీయ సైన్స్ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిని డి.పద్మ అనిల్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకోని వారు మాట్లాడుతూ వైకల్యాన్ని వీడి ఆత్మస్థైర్యం, మానసిక స్టైర్యంతో ముందుకు వెళ్లడం ద్వారా అద్భుతాలు సృష్టించడం జరుగుతుందన్నారు. స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాల నుండి ఇప్పటికే సుమారు ఐదుగురు విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించడం జిల్లాకే గర్వకారణమని, కేవలం స్నేహ సొసైటీ విద్యార్థులే కాకుండా మన భారత దేశంలో ఎంతోమంది శారీరక వైకల్యాన్ని అధిగమించి వివిధ రంగాల్లో రాణించడం జరిగిందన్నారు. ఎన్నో అద్భుతాలు సృష్టించడం జరిగిందన్నారు. అంగవైకల్యంతో జన్మించినప్పటికీ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ ప్రోత్సాహం ఇచ్చినప్పుడే అంద విద్యార్థులైనప్పటికీ వివిధ రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తారని తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని దివ్యాంగ విద్యార్థులు తమలో దాగి ఉన్న మేదస్సుకు పదును పెట్టి రకరకాల సైన్స్ ప్రయోగాలు ప్రదర్శించడం అభినందించదగ్గ విషయం అన్నారు. దివ్యాంగ విద్యార్థుల్లో మానసిక ధైర్యాన్ని పెంచే దిశగా కృషి చేస్తున్న స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, కార్యదర్శి సిద్దయ్య, ప్రిన్సిపాల్ రాజేశ్వరి, స్నేహ సొసైటీ ఉపాధ్యాయ సిబ్బందిని ఆమె అభినందించారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా సైన్స్ అధికారి గంగా కిషన్, జన విజ్ఞాన వేదిక జిల్లా బాధ్యులు విజయనంద రావు, విజన్ ఎంపవర్ రాకేష్, ఆయా పాఠశాలల నుండి వచ్చిన ఉపాధ్యాయులు మాట్లాడుతూ సైన్స్ అనేది జీవన మనుగడలో చాలా ముఖ్యమైందన్నారు. ఉదయం నుండి రాత్రి వరకు సైన్సు మీద ఆధారపడి ఉంటుందని తెలిపారు. సర్ సివి రామన్ అలాగే ఎంతో మంది నిపుణులు అద్భుతాలు సృష్టించిన విషయాలను విద్యార్థులకు సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని విద్యార్థులు ప్రదర్శించిన ప్రదర్శనలను ఎంతో ఆసక్తిగా తిలకించి చేసిన ప్రదర్శనను గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులను ఎంతో అభినందించారు. పిల్లలను ఎప్పుడైనా ప్రోత్సహించినప్పుడే ఇలా ఉన్నత శిఖరాలు అధిరోహించడం సాధ్యమవుతుందన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏర్పాటుచేసిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రధానం చేశారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి జ్ఞాపికలు మెమొంటులతో ఘనంగా సన్మానించారు.

