హైదరాబాద్, బతుకమ్మ :
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, పునరుద్ధరణ కార్యక్రమాన్ని డిజిటల్ విధానంలో చేపట్టేందుకు కీలక చర్యలు ప్రారంభించింది. ఈ ప్రక్రియలో భాగంగా రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఇంచార్జీలను పార్టీ అధినేత ప్రకటించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సాంకేతికంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ఐటీ నిపుణుడిని నియమించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరందరికీ హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ లో ప్రత్యేక డిజిటల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రకటించిన మేరకు సభ్యత్వ నమోదు కోసం ప్రత్యేకంగా రూపొందిస్తున్న డిజిటల్ యాప్‌కు తుది మెరుగులు దిద్దుతున్నట్లు సమాచారం. త్వరలోనే యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. తెలంగాణ భవన్‌లో శిక్షణ పూర్తైన అనంతరం, జిల్లా పార్టీ కార్యాలయాల్లో విస్తృత స్థాయి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇంచార్జీల ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో బూత్‌ల సంఖ్యను ఆధారంగా తీసుకుని, ఒక్కో బూత్‌కు ఇద్దరు కార్యకర్తల చొప్పున ఎంపిక చేసి వారం రోజుల పాటు శిక్షణ శిబిరాలు నిర్వహించబడతాయి. ఈ మొత్తం కార్యక్రమాన్ని రాష్ట్ర కమిటీ నియమించిన ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ ఇంచార్జీలు జిల్లా వారీగా సమన్వయం చేస్తారు. డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయ్యిన వెంటనే సభ్యత్వ నమోదు తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. సభ్యత్వ నమోదు ప్రారంభ రోజున స్వయంగా కేసీఆర్‌తో పాటు పార్టీ ముఖ్య నాయకులు సభ్యత్వ పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంపొందించేలా పండుగ వాతావరణంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు చేస్తోంది. అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వివిధ కమిటీల ఏర్పాటుకు ఎన్నికల షెడ్యూల్‌ను కూడా త్వరలో ప్రకటించనున్నారు. నిర్ణయించిన గడువుల్లో కమిటీల నియామక ప్రక్రియ పూర్తి చేసి, అనంతరం పార్టీ శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నట్లు సమాచారం.