సచ్చినోడు చెప్పిండా..?

0 2,494

. ఫోన్ లో దబాయింపులకు దిగిన యూనియన్ నాయకుడు

. ఇబ్బందుల్లో ఉన్న ఏఎల్ఎంను మరిన్ని సమస్యల్లోకి నెట్టిన ఘనులు

. ప్రాణం పోయాక.. అయ్యోపాపమంటూ మొసలి కన్నీరు

. విద్యుత్ శాఖ బదిలీల్లో ఇష్టారాజ్యాన్ని ఎత్తి చూపిన ‘బతుకమ్మ’

నిజామాబాద్, బతుకమ్మ : గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లుగా ఉంది ఆర్మూర్ డివిజన్ లోని విద్యుత్ యూనియన్ నాయకుడి పరిస్థితి. తన తల్లి క్యాన్సర్ తో పోరాడుతోందని, రోడ్డు ప్రమాదంలో గాయపడిన తనకు ఆరోగ్యం సహకరించడం లేదని బదిలీల సందర్భంగా ఏఎల్ఎం శ్రీరాములు అధికారులకు, యూనియన్ నాయకుడికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. పైగా ఆర్మూర్ సబ్ స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న అతడిని బట్టాపూర్ కు ఫీల్డ్ విధుల్లోకి బదిలీ చేశారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన శ్రీరాములు నాటి నుంచి ప్రతి రోజూ అటు యూనియన్ నాయకులకు, ఇటు తోటి ఉద్యోగులకు ఫోన్ లు చేస్తూ, ప్రత్యక్షంగా కలుస్తూ తన పరిస్థితిపై ఆందోళన చెందాడు. చివరకు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై గుండె పోటుతో కన్నూమూశాడు.

తప్పులను ఎత్తిచూపుతూనే ఉన్న ‘బతుకమ్మ’

శాఖ బదిలీల్లో జిల్లాస్థాయిలో చోటుచేసుకుంటున్న లొసుగులను మొదటి నుంచి ‘బతుకమ్మ’ ఎత్తి చూపుతూనే ఉంది. ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరించిన అధికారులు.. అండగా ఉంటామని అభయమిచ్చిన యూనియన్ నాయకులు పలువురు ఉద్యోగులతో ఆడుకున్నారు. తమకు నచ్చిన వారిని.. వారికి నచ్చిన చోటికి బదిలీ చేయించారు. యూనియన్ ల నాయకులు హెడ్ క్వార్టర్ ను వీడకుండా వేలాడుతున్న విషయం బహిరంగ రహస్యమే. వీటన్నింటిని ‘బతుకమ్మ’ ఎత్తి చూపింది.

అంత ఉలుకెందుకు..?

బదిలీలకు సంబంధించి శాఖ నుంచి స్పష్టమైన నిబంధనలను విడుదల చేసినప్పటికీ అవేవీ పట్టించుకున్న దాఖలాలు లేవు. గుండె పోటుతో చనిపోయిన ఏఎల్ఎం శ్రీరాములు దీనావస్థ గురించి శాఖలోని డివిజన్ పరిధిలో అందరికీ తెలిసు. మృతుడి తల్లి క్యాన్సర్ తో  పోరాడుతుండగా అతడు తరచూ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తనకు ఫీల్డ్ లో  కాకుండా సబ్ స్టేషన్ ఇప్పించాలని యూనియన్ నాయకుడికి తరచుగా ఫోన్ చేసినప్పటికీ.. అతడు ఎత్తలేదనే విషయాన్ని ‘బతుకమ్మ’ వెలుగులోకి తెచ్చింది. గుమ్మడికాయ దొంగ మాదిరి భుజాలు తడుముకున్న సదరు నాయకులు ‘బతుకమ్మ’ విలేకరికి ఫోన్ చేసి.. ‘నీకెవరు చెప్పారు ఫోన్ ఎత్తలేదని.. సచ్చినోడు చెప్పిండా..’’ అంటూ రుసరుసలాడుతూ ఒకింత అహంకారాన్ని ప్రదర్శించాడు. చనిపోయిన ఏఎల్ఎం శ్రీరాములు తమ యూనియనే అని.. రాసేటప్పుడు తమను అడిగి రాయాలని సదరు నాయకుడు సలహా ఇవ్వడం గమనార్హం. డివిజన్ లో అంతా తనదే పెత్తనం అని విర్రవీగుతున్న సదరు నాయకుడి వ్యవహారశైలిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అతడిపై ఉన్నతాధికారులు కన్నేసి ఉంచకపోతే కిందిస్థాయి సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

యూనియనే.. ప్రొటెక్షన్ లేదేమి

తీవ్రమానసిక ఒత్తిడికి లోనై కన్నమూసి ఏఎల్ ఎం తమ యూనియన్ కు చెందినవాడే అని చెప్పుకొస్తున్న నాయకుడు.. బాధితుని దీనావస్థ తెలిసి కూడా ప్రొటెక్షన్ ఇప్పించలేదెందుకనే ప్రశ్నలు ఆర్మూర్ డివిజన్ లో వినిపిస్తున్నాయి. కంపెనీ సిఎండి ఇచ్చిన ఆదేశాలలో ఆరు వ్యాధులలో ఒకటైన క్యాన్సర్ వ్యాధి మృతిడి తల్లికి ఉంది. ఈ కోణంలో ఆలోచించైనా శ్రీరాములకు ప్రొటెక్షన్  రావాల్సి ఉండగా, కనీసం తమ యూనియన్ అని చెప్పుకొస్తున్న వారు  కోరుకున్న సబ్ స్టేషన్ ఇప్పించలేకపోయారు. ఏఎల్ఏం శ్రీరాములు కోరిన చోట పోస్టింగ్ ఇవ్వడం అధికారికి ఇష్టం లేకపోతే, తాను ఇప్పిస్తానని యూనియన్ నాయకుడు అభయం ఇచ్చి తప్పించుకోవడం వెనుక వేరే మర్మం ఉందనే ప్రచారం సాగుతోంది.

Leave A Reply

Your email address will not be published.