30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

వేములవాడ అభివృద్ధిని కొనసాగించాలి

Must read

📰 Generate e-Paper Clip

ఆలయ అభివృద్ధికి కేసిఆర్ హయాంలో రూ.250 కోట్లు ఖర్చు చేశాం

సిరిసిల్ల చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి

బీఆర్ఎస్ కార్యకర్తలపై వేధింపులు ఆపాలి

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

వేములవాడ, బతుకమ్మ :  వేములవాడలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొదలైన అభివృద్ధి పనులను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారిన అభివృద్ధి కొనసాగాలన్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ….తెలంగాణకు కొంగుబంగారం లాంటి రాజరాజేశ్వర స్వామి వారి కరుణాకటాక్షాలు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.  బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వేములవాడ ఆలయ అభివృద్ధి కోసం కేసీఆర్ రూ. 250 కోట్లు ఖర్చు చేశారని చెప్పారు.  ప్రభుత్వాలు మారినంత మాత్రాన అభివృద్ధి ఆగవద్దని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో గుడి చెరువు వద్ద 30 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆలయానికి అందించిందని, ప్రస్తుతం అక్కడ అభివృద్ధి జరగడం లేదని స్థానికులు చెబుతున్నారన్నారు.  అక్కడ అభివృద్ధి పనులను కొనసాగించి త్వరగా పూర్తిచేయాలని సూచించారు.

సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారింది

రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే చేనేత జిల్లాగా పేరు పొందిందని, చేనేత కార్మికుల కోసం అప్పటి మంత్రి కేటీఆర్  అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ కార్యక్రమాలను సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు. సిరిసిల్ల మళ్లీ ఉరిసిల్లగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, అన్ని నియోజకవర్గాలను ప్రభుత్వం సమానంగా చూడాలని సూచన చేశారు. సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ వేధింపులు ఎక్కువయ్యాయని, కేటీఆర్  ఫోటో పెట్టుకున్నందుకు టీ స్టాల్ ను తీసేసారని  ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  కక్షపూరిత వ్యవహారాలను విరమించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు.

Development of Vemulawada should continue

 

More articles

Latest article