. ఆగమేఘాల మీద ఏఎంవో నియామకం
. ఉత్తర్వులను రద్దు చేసిన ఉన్నతాధికారులు
. డిప్యుటేషన్లు, ప్రైవేట్ స్కూళ్ల అనుమతుల సంగతేమిటో..?
నిజామాబాద్, బతుకమ్మ: వివాదాస్పద నిర్ణయాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే జిల్లా విద్యాశాఖను ఇటీవల బదిలీ అయిన డీఈవో దుర్గా ప్రసాద్ వెళ్తూవెళ్తూ మళ్లీ చర్చల్లోకి నెట్టి వెళ్లారు. సోమవారం రాత్రి బదిలీ ఉత్తర్వులు వచ్చిన తరువాత సదరు ఉన్నతాధికారి నియామకాలు, డిప్యుటేషన్లు చేపట్టడం చర్చనీయాంశమైంది. విద్యాశాఖలో అత్యంత కీలకమైన ఏఎంవో పోస్టులో అనర్హుడిని కూర్చోపెట్టారు. సీనియర్ గెజిటెడ్ హెడ్మాస్టర్ కు అప్పగించాల్సిన బాధ్యతలను ఇటీవలే కాలూర్ నుంచి భీమ్ గల్ మండలం పల్లికొండ జిల్లా పరిషత్ హై స్కూల్ కు బదిలీ అయిన సుధాకర్ రెడ్డికి అప్పగించారని ఉపాధ్యాయ సంఘాలు ఫిర్యాదులు చేస్తున్నాయి. బదిలీపై వెళ్లిన డీఈవో దుర్గాప్రసాద్ డబ్బులు తీసుకుని దొడ్డిదారిలో నియమించారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా జిల్లా విద్యాశాఖాధికారిగా బాధ్యతలు చేపట్టిన అశోక్ కు, ఆర్జేడీకి ఏఎంవో పోస్టు నియామక ఉత్తర్వులను రద్దు చేయాలని ఫిర్యాదు చేశారు. ముందుగా ఏఎంవో పోస్టు భర్తీని హోల్డ్ లో ఉంచాలని అనుకున్నప్పటికీ డిప్యూటీ డైరెక్టర్ లింగయ్య రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
డిప్యుటేషన్లు… ప్రైవేట్ స్కూళ్లకు అనుమతులు.. పెండింగ్ పైళ్ల క్లియరెన్స్ లు
బదిలీపై వెళ్తిన డీఈవో దుర్గాప్రసాద్ ఆగమేఘాల మీద 16 మందికి డిప్యుటేషన్లు ఇవ్వడంతోపాటు ప్రైవేట్ స్కూళ్లకు అనుమతులు ఇచ్చినట్లు తెలిసింది. అలాగే పెండింగ్ బిల్లులను క్లియర్ చేశారని, ఇవన్నీ పనులు భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని పూర్తి చేశారని ఉపాధ్యాయులు, ఆయా సంఘాల వారు ఆరోపిస్తున్నారు. గతంలో విద్యాశాఖలో ఓ పోస్టులో పని చేసిన అధికారి మంగళవారం డీఈవో కార్యాలయంలో తిష్టవేసి పెండింగ్ ఫైళ్లను క్లియరెన్స్ చేయించడం విద్యాశాఖలో చర్చనీయాంశమైంది. రూ.7లక్షల బిల్లును క్లియర్ చేయడం గమనార్హం. ప్రధానంగా నిజామాబాద్ నగరం పరిధిలోని ఓ ఎంఈవో ప్రైవేట్ పాఠశాలల అనుమతుల ఫైళ్ల క్లియరెన్స్ బాధ్యతను తీసుకున్నట్లు తెలిసింది. ఏఎంవో పోస్టు భర్తీ విషయంలో లక్షకుపైగా డబ్బులు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బిజినెస్ టీచర్ కు పోస్టింగ్ కోసం జరిగిన వ్యవహారంలో ప్లాట్ ను నజరానాగా ఇచ్చినట్లు తెలుస్తోంది.
విచారణ దిశగా అడుగులు పడేనా?
బదిలీ ఉత్తర్వులు వచ్చిన గంటల వ్యవధిలో సుమారు వంద ఫైళ్ల క్లియరెన్స్, డిప్యుటేషన్లు, పోస్టింగ్ ల వ్యవహారంపై ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. డీఈవో దుర్గాప్రసాద్ మంగళవారం పాత తేదీలతో చేసిన పనులపై విచారణ కోరుతున్నాయి. ఇదిలా ఉండగా గతంలో జరిగిన ఉపాధ్యాయుల అక్రమ డిప్యుటేషన్లపై అదనపు కలెక్టర్ అంకిత్ కుమార్ విచారణ జరిపి అవి వాస్తవమేనని నివేదిక ఇవ్వడంతో రద్దయ్యాయని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేశ్ తెలిపారు. ఏఎంవో నియామక ఉత్తర్వులను రద్దు అయినప్పటికీ.. ఆగమేఘాల మీద డిప్యుటేషన్లు, నూతన స్కూళ్ల అనుమతులపై, పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్ పై విచారణ దిశగా అడుగులు పడతాయా? అనేదానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.
