27.6 C
Hyderabad

ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలను తగ్గించాలి

Must read

📰 Generate e-Paper Clip

 

. . . డీఎంహెచ్‌వో డాక్టర్ బి. రాజశ్రీ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలను తగ్గించేందుకు వైద్యాధికారులు, వైద్య సిబ్బంది సమన్వయంతో పనిచేసి, నివారించగల ప్రతి ప్రాణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రాజశ్రీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో కార్యాలయంలో డాక్టర్ బి. రాజశ్రీ అధ్యక్షతన ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైద్యాధికారులు, సిబ్బంది నిరంతరం తమ వైద్య పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. గర్భిణీలు, చిన్నారుల్లో కనిపించే ప్రమాదకర లక్షణాలను ముందుగానే గుర్తించి, అవసరమైన సందర్భాల్లో ఉన్నత వైద్య కేంద్రాలకు సకాలంలో రిఫర్ చేయాలని తెలిపారు. బాలింతలను క్రమం తప్పకుండా వారి ఇళ్ల వద్ద ఫాలోఅప్ చేయాలని, ప్రతి గర్భిణీ, బాలింతకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని సూచించారు. ప్రసవం అనంతరం తొలి గంటలోనే శిశువుకు తల్లిపాలు అందించే ప్రాముఖ్యతను వివరించాలని అన్నారు. వివిధ ప్రాంతాల నుంచి తల్లి ఇంటికి వచ్చే వారు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వారి వివరాలను మదర్ ఇన్, మదర్ ఔట్ విధానంలో పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని సూచించారు. తద్వారా ఫాలోఅప్ సేవలను సక్రమంగా కొనసాగించి, ప్రమాదంలో ఉన్న తల్లులు, శిశువుల ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని తెలిపారు. గర్భిణీలు పొగాకు, మద్యం వంటి హానికర అలవాట్లకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలని, మూఢనమ్మకాలను తొలగించాలని అన్నారు. ఎంసీహెచ్ కార్డులో సూచించిన అంశాలను తప్పనిసరిగా పాటిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో ప్రథమ చికిత్స కిట్లు, అత్యవసర కిట్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. బిడ్డకు బిడ్డకు మధ్య కనీసం మూడు సంవత్సరాల విరామం ఉండేలా కుటుంబ నియంత్రణపై విస్తృత అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌వో సూచించారు. తాత్కాలిక కుటుంబ నియంత్రణ పద్ధతులైన ఐయూసీడీ, అంతర ఇంజక్షన్, పీపీఐయూసీడీతో పాటు అవసరమైన వారికి శాశ్వత కుటుంబ నియంత్రణ పద్ధతులపై కౌన్సెలింగ్ నిర్వహించాలని తెలిపారు. గత రెండు సంవత్సరాల ప్రసవ రికార్డుల ఆధారంగా అర్హులైన మహిళల జాబితాను రూపొందించి వారికి ప్రత్యేకంగా అవగాహన, కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. గర్భిణీలకు ప్రతి నెలా వైద్య పరీక్షలు నిర్వహించి, రక్తహీనత, బరువు పెరుగుదల, రక్తపోటు తదితర అంశాలను పరిశీలించాలని అన్నారు. ప్రమాదకర లక్షణాలు ఉన్న గర్భిణీలను గుర్తించి వెంటనే ఉన్నత ఆసుపత్రులకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. అంబులెన్స్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని తెలిపారు. మహిళా శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ తదితర ప్రభుత్వ శాఖల సహకారంతో కుటుంబ నియంత్రణ, తల్లీబిడ్డల ఆరోగ్యం, పోషణ, ప్రమాదకర లక్షణాల గుర్తింపుపై జిల్లా వ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని డీఎంహెచ్‌వో కోరారు.

. . . నెలలోపు మరణాల ఆడిట్ పూర్తి చేయాలి

పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ మాట్లాడుతూ ఐదేళ్లలోపు చిన్నారుల మరణాలపై ప్రతి నెల 10వ తేదీలోపు ఆడిట్ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తల్లిపాల ప్రాముఖ్యత, ముఖ్యంగా ప్రసవం అనంతరం గంటలోపు తల్లిపాలు అందించడం వల్ల కలిగే ప్రయోజనాలపై తల్లులకు అవగాహన కల్పించాలని అన్నారు. గర్భిణీ స్త్రీల బరువు పెరుగుదలను ప్రతి నెలా సమీక్షించాలని, శిశువులకు ఆరు నెలల తర్వాత అనుబంధ ఆహారం ప్రారంభించే అంశంపై బాలింతలకు అవగాహన కల్పించాలని తెలిపారు. స్త్రీ వైద్య నిపుణులు మాట్లాడుతూ గర్భిణీలకు రక్తపోటు, హిమోగ్లోబిన్, ఎత్తు, బరువు తదితర పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, కనీసం నాలుగు సార్లు వైద్యులచే పరీక్షలు చేయించాలని సూచించారు. ప్రమాదకర లక్షణాలు ఉన్న గర్భిణీలను ముందుగానే గుర్తించడం, తల్లిపాల ప్రాముఖ్యత, తల్లి బరువు పెరుగుదలపై పర్యవేక్షణ, కుటుంబ నియంత్రణ పద్ధతుల వినియోగం, అంబులెన్స్ సేవలను సకాలంలో వినియోగించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఈ సమీక్ష సమావేశంలో డీఐఓ డాక్టర్ ఎం. అశోక్, స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ అరుణ రేఖ, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ నవీన్, డాక్టర్ సుస్మిత, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు డాక్టర్ రవీందర్, డాక్టర్ విద్య, డాక్టర్ సికందర్ నాయక్, డీఎస్‌ఓ డాక్టర్ వెంకటేష్, డాక్టర్ నవ్య, సీడీపీవోలు రాంబాబు, డీహెచ్‌ఈలు గన్పూర్ వెంకటేశ్వర్లు, మనోహర్, డీడీఎం పృథ్వి, వివిధ పీహెచ్‌సీల వైద్యాధికారులు, పర్యవేక్షణ అధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సమీక్షలో పోచంపాడు, నందిపేట్, రెంజల్, బినోల, సీఎస్ కాలనీ, రుద్రూర్, జక్రాన్‌పల్లి, ముదక్పల్లి, వేల్పూర్, మోస్రా తదితర 10 పీహెచ్‌సీల వైద్యాధికారులు, సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తల పనితీరును సమీక్షించారు.

More articles

Latest article