. . . నేరస్తుడి నుండి వెండి కడియం బంగారు తాయత్తు స్వాధీనం
బిచ్కుంద, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్ పరిధిలో గత సంవత్సరం జరిగిన ఓ చోరీ కేసును బిచ్కుంద పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. బిచ్కుంద సర్కిల్ ఇన్స్ పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 22 2025న జాదవ్ బన్సీలాల్ తన వ్యవసాయ పొలానికి వెళ్తుండగా దౌల్తాపూర్ శివారులో గుర్తుతెలియని వ్యక్తులు అతనిని అడ్డగించి మాయమాటలు చెప్పి పది తులాల వెండి కడియం, 1.5 గ్రాముల బంగారు తాయత్తును అపహరించుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అప్పట్లోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా శనివారం నమ్మదగిన సమాచారం మేరకు బిచ్కుంద పోలీసులు కందర్ పల్లి శివారులో తనిఖీలు నిర్వహించారు. అక్కడ అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నేరస్తుడు వర్ని మండలం గోవూరు గ్రామానికి చెందిన గొప్ప భూమయ్య (తండ్రి గంగారం) గా గుర్తించారు. నేరస్తుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించడంతో పాటు బాధితుడి వద్ద నుండి దొంగిలించిన వెండి కడియం, బంగారు తాయత్తును పోలీసులకు అప్పగించాడు. పోలీసులు సదరూ సొత్తును స్వాధీనం చేసుకొని నేరస్తుడిని రిమాండ్ కు తరలించారు. కేసు చేదనలో చురుకుగా వ్యవహరించిన బిచ్కుంద ఎస్సై గుండెల రాజు, పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు సిఐ రవికుమార్ తెలిపారు.
