29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

సీపీ పోస్టు వేకెన్సీ @ 100 డేస్

Must read

📰 Generate e-Paper Clip

  • కొత్వాల్ లేకుండా గతి తప్పిన పాలన
  • పోలీసుల ఇష్టారాజ్యం
  • జిల్లాలో పోలీసు అధికారులపై కేసుల నమోదు

నిజామాబాద్, బతుకమ్మ :
నిజామాబాద్ పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ సింగనవారే బదిలీ అయి అప్పుడే 100 రోజులు గడిచాయి. దాదాపు మూడు నెలలుగా ఇంచార్జి సీపీ పాలనలో నిజామాబాద్ కమిషనరేట్ కొనసాగుతుంది. రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల తర్వాత అతిపెద్ద కమిషనరేట్ గా నిజామాబాద్ కమిషనరేట్ కు పేరుంది. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో బోధన్, ఆర్మూర్ సబ్ డివిజన్లతో పాటు సీసీఎస్, టాస్క్ ఫోర్స్, స్పెషల్ బ్రాంచ్, ట్రాఫిక్ లాంటి ప్రత్యేక విభాగాలున్నాయి. రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్ తర్వాత అత్యధిక పోలీస్ స్టేషన్లు కలిగిన కమిషనరేట్ లోనే ఉన్నాయి. అలాంటి కమిషనరేట్ కు కొత్వాల్ ను నియమించకపోవడంతో పాలన గతి తప్పింది.
ఫ్రెండ్లీ పోలీసింగ్ స్థానంలో సెటిల్ మెంట్లకు పోలీస్ స్టేషన్ లు అడ్డాలుగా మారాయి. ఎందుకంటే గత నెలలో రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ ద్వారా పోలీస్ స్టేషన్ లలో ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకునే కార్యక్రమాన్ని తెలంగాణ పోలీసు శాఖ చేపట్టిన విషయం తెలిసిందే. అత్యధికంగా క్యూఆర్ కోడ్ ల ద్వారా ఫీడ్ బ్యాక్ తీసుకుంటే జిల్లాలో పోలీసు శాఖ పని తీరుకు అద్దం పట్టే విధంగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అందుకు కారణం లేకపోలేదు. స్థానికంగా పోలీస్ స్టేషన్ ల ఎస్ హెచ్ వోలు, సర్కిల్ ఇన్స్ పెక్టర్లపై అజామాయిషి కరువైంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పోలీస్ స్టేషన్ లకు అతుక్కపోయిన ముదుర్లు కొందరు స్టేషన్ లను సొంత ఆదాయ వనరుగా మార్చుకున్నారు.
జిల్లాలో జరుగుతున్న ఇసుక, మొరం అక్రమ రవాణా వెనుక పొలిటికల్ లీడర్ల కంటే,రెవెన్యూ శాఖ కంటే పోలీసు శాఖ పెత్తనమే ఎక్కువగా ఉంది. రెవెన్యూ శాఖ వే బిల్లులకు పరిమితం కాగా పోలీసు శాఖ మాత్రం తవ్వకాలు, రవాణా పర్యవేక్షణ మొత్తం చేపట్టి నెల వారి మామూళ్ళతో పాటు వాహనంకు ఇంత సపరేట్ గా వసూళ్ళ కార్యక్రమాన్ని చేపట్టారు. దాంతో ఇన్ లీగల్ దందాలు అన్ని మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుంది. గుట్కా రవాణా అడ్డుఅదుపు లేకుండా సాగుతుంది. గంజాయి విచ్చలవిడిగా వినియోగం జరుగుతుంది. కొకైన్, హెరాయిన్ కంటే ప్రమాదకరమైన నిషేదిత మత్తుపదార్థం అల్ర్పోజోలం, కల్తీకల్లు కుటీర పరిశ్రమ స్థాయికి చేర్చింది.

పోలీస్ స్టేషన్ లలో కూడా ఇది వరకు సెటిల్ మెంట్లు, సివిల్ పంచాయితీలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో కౌంటర్ కేసులకు ప్రాధాన్యత పెరిగింది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేసింది మొదలుకుని ఎఫ్ ఐఆర్ నమోదు కావడం, బాధ్యులను అరెస్టు చేయడం, రిమాండ్ పంపడం, కుదిరితే స్టేషన్ బెయిల్ ఇవ్వడం అంతా అమ్యామ్యాలపై ఆధారపడి ఉంది. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల సివిల్ పంచాయతీల్లో తలదూర్చారని కోర్టులు పోలీసు అధికారులపై కేసుల నమోదుతో పాటు జోక్యం చేసుకోవద్దని ఉత్తర్వులు ఇచ్చాయి. డిచ్ పల్లి సర్కిల్ సిఐతో పాటు జక్రాన్ పల్లి ఎస్సై, కానిస్టేబుల్ పై కేసులు నమోదు చేయాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. మోపాల పోలీస్ స్టేషన్ పరిధిలో సివిల్ పంచాయితీల్లో తలదూర్చినందుకు ఎస్సైతో పాటు ఏకంగా ఇంచార్జి సీపీకి కూడా కోర్టు తాఖీదులు అందడం గమనార్హం. రెంజల్ పోలీస్ స్టేషన్ లో కస్టోడియల్ డెత్ విచారణ డీఎస్పీ ద్వారా చేయించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొన్నటికి మొన్న భీంగల్ సిఐ నవీన్ ను తప్పించిన అధికారులు అక్కడ కొత్త సిఐను నియమించారు. ఎస్సై పై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడం కొత్త చర్చకు దారి తీసింది. ఇందల్వాయి ఎస్సైపై విచారణ కొనసాగుతూనే ఉంది.

More articles

Latest article