26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ముఖ్యమంత్రి బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన సీపీ

Must read

📰 Generate e-Paper Clip

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :

 

ఈ నెల 6న డిచ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్దిపూర్ గ్రామ శివారు లోని కేశపురం గ్రామం పరిధి లో నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభను పురస్కరించుకుని, నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య గురువారం సభా ప్రాంగణాన్ని, పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో విస్తృతంగా పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్  సభ నిర్వహించనున్న స్థలం, ప్రముఖులు కూర్చునే డి-రింగ్ భద్రతా ప్రాంతం, ప్రజలు కూర్చునే విభాగాలు, ప్రవేశనిష్క్రమణ మార్గాలు, అత్యవసర వాహనాల రాకపోకల మార్గాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి రాక కోసం సిద్ధం చేస్తున్న హెలిప్యాడ్ నిర్మాణ పనులను పరిశీలించి, భద్రతా ప్రమాణాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సభకు హాజరయ్యే అశేష జనవాహినిని దృష్టిలో ఉంచుకుని వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపు మార్గాలు, పాదచారుల సౌకర్యాలు, బారి కేడింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు క్విక్ రెస్పాన్స్ టీమ్స్, అంబులెన్సులు, ఫైర్ సర్వీస్ సిబ్బంది అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా బందోబస్తు స్కీమ్‌ పై స్థానిక పోలీస్ అధికారులు, ఇతర విభాగాలతో సమీక్ష నిర్వహించి, శాంతిభద్రతల పరిరక్షణ, గుంపు నియంత్రణ వంటి అంశాలపై పలు కీలక సూచనలు చేశారు. ప్రతి అధికారి పూర్తి అప్రమత్తతతో విధులు నిర్వహించాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలతో సమన్వయంతో కలసి పని చేయాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా, సురక్షితంగా, విజయవంతంగా ముగిసేలా పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా దాదాపు 1200 పోలీస్ సిబ్బంది విధులు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) బస్వరెడ్డి, అదనపు డీ.సీ.పీ (ఎ.ఆర్) రామ్ చంద్రరావు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్ ఏసీపీ లు, ప్రకాష్, వెంకటేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్, మస్తాన్ అలీ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్ పెక్టర్ శ్రీశైలం, సి.ఐలు, రిజర్వు ఇన్స్ పెక్టర్లు, ఎస్సైలు, ఆర్.ఎస్.ఐలు, బందోబస్తుకు ఇతర జిల్లాల నుండి  వచ్చినటు వంటి  పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

CP inspects arrangements for Chief Minister's public meeting
CP inspects arrangements for Chief Minister's public meeting

More articles

Latest article