. . . అధికారులతో కలెక్టర్, సీ.పీ సమీక్ష
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఈ నెల 6న నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, జిల్లా అధికారులతో, సీఎంఓ కార్యాలయం నుంచి హాజరైన భద్రతా విభాగం అధికారులతో కలిసి గురువారం తుది ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డిచ్పల్లి మండలం బర్దీపూర్ శివారులో ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలి ప్రాంగణం, హెలిప్యాడ్, వాహనాల పార్కింగ్ తదితర ప్రాంతాలను నిశితంగా పరిశీలన చేశారు. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు సీఎం కాన్వాయ్ కు ఎలాంటి అడ్డంకులు ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బహిరంగ సభకు వచ్చే వారి వాహనాలను పార్కింగ్ చేసుకునేందుకు ఎంపిక చేసిన ప్రదేశంలోనే వాహనాలు నిలిపేలా చూడాలన్నారు. సీఎం సభకు విద్యుత్ అంతరాయం తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, సభకు హాజరయ్యే వారికి తాగునీరు వంటి వసతులు కల్పిస్తూ, ప్రథమ చికిత్స సదుపాయం, అంబులెన్స్ అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కాగా, ముఖ్యమంత్రి భద్రతకు పకడ్బందీ బందోబస్తును ఏర్పాటు చేయాలని, సీ.ఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పోలీసు అధికారులకు సూచించారు. ఆయా శాఖల అధికారులు పరస్పరం సమన్వయంతో పని చేయాలని అన్నారు. ముందస్తుగానే ఏర్పాట్లను పూర్తి చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, అదనపు డీసీపీ బస్వారెడ్డి, సీఎంఓ కార్యాలయ భద్రతా అధికారి మాధవరావు, ఏసీపీలు రాజా వెంకట్ రెడ్డి, ప్రకాష్, మస్తాన్ అలీ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.

