29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

కాంగ్రెస్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

  • పరారీలో అతని సోదరుడు
  • జిలిటన్ స్టిక్ కేసులో అరెస్టు
  • రిమాండ్ కు తరలించిన పోలీసులు

 

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ లో కలకలం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీలో కామారెడ్డి జిల్లా నుంచి ఇటీవల రాష్ట్ర పీసీసీ విస్తరణలో ఇద్దరికి చోటు కల్పించగా అందులో టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆలియాస్ చందూను సినీ ఫక్కీలో శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. తన ఇంట్లో ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని పోలీసులు మాట్లాడేది ఉందని పోలీస్ స్టేషన్ కు పిలిపించి రాత్రికి రాత్రి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం కలకలం రేపింది.చంద్రశేఖర్ రెడ్డి సోదరుడు సురేందర్ రెడ్డి పరారీలో ఉన్నారని పోలీసులు ప్రకటించారు. ఇటీవల కామారెడ్డి పట్టణంలో కేపీఆర్ కాలనీలో దొరికిన జిలిటెన్ స్టిక్స్ ను అనుమతులు లేకుండా నిలువ ఉంచిన సేవలో కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు గడ్డం చంద్రశేఖర్ రెడ్డిని నిందితుడిగా చేర్చుతూ అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ నెల 3న ఈ కేసులో ముగ్గురు కార్మికులను ఇంటి యజమానిని అరెస్టు చేసిన పోలీసులు వారు ఇచ్చిన వాంగ్మూలం మేరకే చంద్రశేఖర్ రెడ్డిని అరెస్టు చేసినట్లు ప్రకటించారు.

ఇటీవల టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన గడ్డం చంద్రశేఖర్ రెడ్డి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. ఆయన అనుచరులు గడ్డం చందూను సన్మానం, సత్కార కార్యక్రమాల్లో బీజీగా ఉన్నారు.  ఇటీవలనే ఫోన్ ట్యాపింగ్ కేసులో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తన వాంగ్మూలాన్ని ఇవ్వడం గమనార్హం. కామారెడ్డి జిల్లాలో ప్రధానంగా జిల్లా కేంద్రంలో గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మేనియా నడుస్తోందన్న చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వ హయంలో బీఆర్ఎస్ లో ఉన్న గడ్డం చంద్రశేఖర్ రెడ్డి తన భార్యను వైస్ చైర్మన్ గా ఎంపిక చేయడంలో చక్రం తిప్పారు. ఒప్పందం ప్రకారం రెండున్నర సంవత్సరాల కాలపరిమితితో చైర్ పర్సన్ గా ఎంపికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ లో చేరి భార్యను చైర్మన్ గా కొనసాగించడంలో సక్సెస్ అయ్యారు.  అదే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి పోటీ చేయగా అక్కడ అంతా తానై వ్యవహరించారు.

గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై నిషేదిత పేలుడు పదార్థాల అక్రమ నిలువ కేసులో పోలీసులు అరెస్టు చేయడాన్న ఆయన సతీమణి తాజామాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియా ఖండించారు. రాజకీయంగా కక్షసాధింపు ధోరణిలోనే తన భర్తను అక్రమంగా ఇరికించారని ఆరోపించారు. తమకు ఎలాంటి గజం భూమి లేకున్నా శ్రీవారి ఏకో టౌన్ షిప్ (వీభూస్ ఎలైట్ టౌన్ షిప్ వెంచర్)లో పేలుడు పదార్థాలు నిలువ ఉంచారని కేసు నమోదు చేయడం దారుణమని ఆరోపించారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి గడ్డం చందుపై వివాదాలు ముసిరాయి. ప్రధానంగా కామారెడ్డి బల్ధియాపై షాడో చైర్మన్ గా వ్యవహరించారని, తనకు తెలియకుండా ఫైళ్లు కదలనివ్వలేదన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. అంతకుముందే గత ప్రభుత్వ హయంలో కొన్ని ఇల్లీగల్ దందాల విషయంలో చంద్రశేఖర్ రెడ్డి ఆలియాస్ గడ్డం చందుపై కొందరు లేఖలు విడుదల చేయగా అవి వైరల్ అయ్యాయి. తాజాగా అక్రమ పేలుడు పదార్థాల నిలువ కేసులో గడ్డం చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు గడ్డం సురేందర్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రశేఖర్ రెడ్డిని అరెస్టు చేయగా, సురేందర్ పరారీలో ఉన్నారని ప్రకటించారు. గతంలో చంద్రశేఖర్ రెడ్డి నిర్మాతగా, ఆయన సోదరుడు గడ్డం సురేందర్ రెడ్డి హీరోగా అద్వైతం సినిమాను తీసిన డిజాస్టర్ గానే మిగిలింది. తాజాగా రాజకీయాలలో ఎత్తుపల్లాలు సర్వసాధారణమేనని చర్చ జరుగుతుండగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఉవ్వెత్తున ఎగిసి కేసులతో కిందపడ్డాడనే చర్చ జరుగుతుంది. రాజకీయ ప్రత్యర్థులు ఆయనపై కేసులు పెట్టి రాజకీయ జీవితానికి చెక్ పెట్టారనే ప్రచారం కూడా జరుగుతుంది.

Congress TPCC General Secretary Gaddam Chandrasekhar Reddy arrested

More articles

Latest article