- రాహుల్ గాంధీతో వరంగల్ లో రైతు డిక్లరేషన్ చేయించారు
- నమ్మి ఓటేసిన రైతులను నిండా ముంచారు
- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
వరంగల్, బతుకమ్మ : రైతులను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ నాయకులను గ్రామగ్రామాన నిలదీయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ లో నిర్వహించిన సమావేశానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరై మాట్లాడారు. ‘‘రాహుల్ గాంధీన తీసుకొచ్చి కాంగ్రెస్ నేతలు వరంగల్ లో రైతు డిక్లరేషన్ చేయించారు. రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా అమలు చేయలేకపోయింది. రైతు డిక్లరేషన్ వల్ల వరంగల్ రైతులు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేశారు. నమ్మి ఓటేసిన రైతులను నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్నికల కోసం రాహుల్ గాంధీ వరంగల్ వచ్చి రైతు డిక్లరేషన్ ఇచ్చారు. రాహుల్ గాంధీ మళ్లీ వరంగల్ వచ్చి రైతు డిక్లరేషన్ అమలుకు పూనుకోవాలి. రైతు డిక్లరేషన్ లో మొట్టమొదటి అంశం రుణ మాఫీ హామీ. రైతు మాఫీని సాగదీసి సాగదీసి అమలను ప్రకటించినా … 50 శాతం మంది రైతులకు ఇంకా రైతు రుణ మాఫీ కాలేదు. కాంగ్రెస్ పార్టీ హామీని నమ్మి అనేక మంది రైతులు కొత్తగా రుణాలు తీసుకున్నారు. కానీ వారి రుణాలను మాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది. కౌలు రైతులకు ఏడాదికి రూ 15 వేలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైంది ?. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కౌలు రైతుల గురించి మాట్లాడడం లేదు. కౌలు రైతులను మరిచిపోయినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి ఏం శిక్ష వేయాలి ?. రైతు బంధు నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగవేసింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రజలను మభ్యపెట్టడానికి ఇటీవల రైతు భరోసాను ప్రకటించారు. అన్ని పంటలకు మద్ధతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ విస్మరించింది. మద్ధతు ధరపై తక్షణమే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

రైతు కూలీలకు సంవత్సరానికి రూ 12 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. కోటి ఉపాధి హామీ కార్డులు ఉంటే… కేవలం 20 లక్షల మందికే ఇస్తామన్నారు. కానీ వారికి కూడా ఇచ్చిన పాపాన పోలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ గ్రామాల్లో నిలదీయండి. ధరణితో నష్టం జరిగిందని కాంగ్రెస్ దుష్ప్రచారం చేసింది. కాంగ్రెస్ తెస్తానన్న భూమాత ఎక్కడా కనిపించడం లేదు. పాత ధరణి వ్యవస్థనే బాగుందని రైతులు అంటున్నారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపుతామని ప్రభుత్వం ఊదరగొట్టింది. కానీ నకిలీ విత్తనాలను కట్టడి చేయడానికి ఏ మాత్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. వరంగల్ అభివృద్ధికి కేసీఆర్ మొదలుపెట్టిన పనులను ముందుకు తీసుకెళ్లకుండా రేవంత్ రెడ్డి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. మూమునూరు ఎయిర్ పోర్టుకు రాణి రుద్రమా పేరు పెట్టాలి. దీనిపై కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రికి లేఖ రాస్తాము. ఆగస్టు 6న జయశంకర్ జయంతి ఉత్సవాలను వరంగల్ లో తెలంగాణ జాగృతి పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. రైతుల పొలాల్లోకి కృష్ణా, గోదావరి నీళ్లను మళ్లించాలని తెలంగాణ ఉద్యమం సాగింది. రాష్ట్రం ఏర్పడక ముందు 12- 13 సంవత్సరాల్లో 789 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి అప్పటి ప్రభుత్వం దాదాపు 400 మంది రైతు కుటుంబాలకు రూ. 5 లక్షలు ఇచ్చింది. మిగితా వాళ్లకు చట్టరీత్యా సహాయం చేయలేకపోతే… తెలంగాణ జాగృతి తరఫున 389 మంది రైతు కుటుంబాలకు నాలుగేళ్ల పాటు ప్రతీ నెల 4500 పెన్షన్ గా అందించాము. రైతుల సమస్యలపై, రైతుల కోసం తెలంగాణ జాగృతి సంస్థ ఎంతో కృషి చేసింది. రైతు సమస్యలను తీరడంపై శాస్త్రవేత్తలతో కూడా తెలంగాణ జాగృతి చర్చలు జరిపింది. రైతుల కోసం కేసీఆర్ రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. మిషన్ కాకతీయ కార్యక్రమం ద్వారా చెరువులను బాగు చేశారు’’ అని అన్నారు.

