. . . రోడ్డుపై బైఠాయించి బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో
రుద్రూర్, బతుకమ్మ :
కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలు ఆపాలని బీఆర్ఎస్ శ్రేణులు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులపై ఆదివారం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని దానిని లాక్కున్నారు. దీంతో ఆగ్రహించిన నేతలు ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా మండల బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గాండ్ల మధు, నాయకులు కొత్తపల్లి రవి కిరణ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ పై రాజకీయ వేధింపులకు పాల్పడుతుందన్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు. పోలీసులకు, పార్టీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు దౌర్ సాయిలు, షేక్ సలీం, నీరడి సాయిలు, సాయికిరణ్, శివ, శేఖర్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

