27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఆలూరు లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ :   ఆలూరు మండలంలో కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా పరిషత్ హై స్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సహకార సంఘం ఎరువుల గోడౌన్, తహసీల్దార్ కార్యాలయాలను కలెక్టర్ సందర్శించారు. ముందుగా కల్లడి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. పీ.హెచ్.సీ ద్వారా ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలను, అందుబాటులో ఉన్న ఔషధ నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. స్థానికంగానే ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని మెడికల్ ఆఫీసర్ కు సూచించారు. వ్యాక్సినేషన్ వంద శాతం జరగాలని, డెంగ్యూ, మలేరియా, అతిసారం, విషజ్వరాలు వంటివి ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, టీ.బీ ముక్త్ భారత్ అభియాన్ పక్కాగా అమలు కావాలని, గ్రామాలలో ఆరోగ్య శిబిరాలను విరివిగా నిర్వహించాలని సూచించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉండాలని, గర్భిణుల నమోదు, వారికి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించేలా పక్కాగా పర్యవేక్షణ జరపాలన్నారు. అనంతరం కలెక్టర్ కల్లడి జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించి, బోధన, బోధనేతర సిబ్బందితో పాటు విద్యార్థుల హాజరును ఫేస్ రికగ్నేషన్ విధానం (ఎఫ్.ఆర్.ఎస్) ద్వారా చేపడుతున్నారా లేదా అని పరిశీలించారు. నూటికి నూరు శాతం ఎఫ్.ఆర్.ఎస్ ద్వారా హాజరు అమలు కావాలని కలెక్టర్ ఆదేశించారు. ఏవైనా సాంకేతిక ఇబ్బందులు ఉంటే, టెక్నికల్ విభాగం వారిని సంప్రదించి పరిష్కరించుకోవాలని అన్నారు. ఫేస్ రికగ్నేషన్ హాజరు సంపూర్ణంగా అమలు అయ్యేలా రోజువారీ పర్యవేక్షణ చేయాలని పాఠశాలల హెచ్.ఎం నాగరాజును ఆదేశించారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను తనిఖీ చేసిన కలెక్టర్, మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ద్వారా పాఠశాలలో ఏవైనా కొత్త పనులకు ప్రతిపాదనలు పంపించారా? అని ఆరా తీశారు. అదనపు తరగతి గదులు, టాయిలెట్స్, తాగునీటి వసతి వంటి సదుపాయాలు అవసరం ఉన్న పక్షంలో ప్రతిపాదనలు పంపాలని సూచించారు. సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్, ఎరువుల నిల్వలను పరిశీలించారు. రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని, స్టాక్ మిగిలి ఉన్నప్పుడే, కొత్త స్టాక్ తెప్పించుకోవాలని ఎరువుల గోడౌన్ నిర్వాహకులకు సూచించారు. గ్రామంలో నర్సరీల నిర్వహణ, మొక్కల పెంపకం, పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ చర్యల గురించి పంచాయతీ కార్యదర్శిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొక్కలకు ట్యాంకర్ ద్వారా నీటిని అందించేలా చూడాలని, తద్వారా పంచాయతీకి ఆదాయం కూడా సమకూరుతుందన్నారు.    ఆలూరు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్, భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో గ్రామం వారీగా రెవెన్యూ అధికారులు, సిబ్బందితో సమీక్ష జరిపారు. వచ్చిన దరఖాస్తులలో ఆయా మాడ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయ్యిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు.   దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ, వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని తహసీల్దార్ రమేష్ ను ఆదేశించారు. ఆలూరు లో నూతనంగా చేపడుతున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణం పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయించాలని ఇంజనీరింగ్ విభాగం అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట ఎంపీడీవో ఎం.గంగాధర్, స్థానిక అధికారులు ఉన్నారు.

Collector conducts surprise inspections in Aluru

More articles

Latest article