- ఉద్యోగుల పెండింగ్ బిల్లులు తక్షణమే చెల్లించాలి
- డిటిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శంతన్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : 14523సుమారు రెండేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పె న్షనర్లకు చెల్లించవలసిన అనేక రకాల బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో, మానసిక వేదనకు గురౌతున్నారని తక్షణమే దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటిని ప్రభుత్వం హామీ పడిన విధంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి పి. శంతన్ విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో డిటిఎఫ్ జిల్లా కమిటీ సమావేశం అధ్యక్షుడు యం. బాలయ్య అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. వివిధ సమస్యలపై కమిటీ చర్చించిన అనంతరం కమిటీని ఉద్దేశించి శంతన్ మాట్లాడారు. గత అక్టోబర్ 24 న ముఖ్యమంత్రి టీజీఇ జెఏసి నాయకులతో సుదీర్ఘంగా మూడు గంటలు చర్చించిన తర్వాత మంత్రివర్గ ఉప సంఘం నియమించి సమస్యలు పరిష్కరిస్తానని ఇచ్చిన హామీ ప్రకారంగా మంత్రివర్గ ఉప సంఘం ఏడు నెలలు గడిచిన నేటికీ నియమించకపోవడం వల్ల సుమారు రెండేళ్లుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బిల్లుల డబ్బులు అందక తీవ్ర మనో వేదనకు గురవుతున్నారన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ తో పాటు దాచుకున్న జిపిఎఫ్ నిధులు, మెడికల్ రియంబర్స్మెంట్, తదితర చెల్లింపులు రెండు సంవత్సరాలుగా నిలిచిపోయినాయని తెలిపారు. బిల్లులు చెల్లింపులు జరగకపోవడంతో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో వీధిపాలైన సంఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి సిసిసి (కమాండ్ కంట్రోల్ సెంటర్) లో పోలీసులకు అవార్డుల ప్రధాన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగస్తులు సమరం చేస్తామంటూ ఉద్యోగ నేతలు అంటున్నారని సమరం ప్రజలతోనా! అంటూ, అసహన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వ ఆదాయం మించి చెల్లింపులు జరిపేది లేదని ఏ సంక్షేమ పథకాలను నిలుపుదల చేయాలో ఉద్యోగులే చెప్పాలని ప్రశ్నించడం, అక్కసు వెళ్ళగక్కడం ఉద్యోగస్తులను, ఉపాధ్యాయులను పెన్షనర్లను విష్మయానికి గురిచేసిందని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని ఉద్యోగులుగా తమకు రావలసిన దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న బిల్లులు మాత్రమే చెల్లించమంటున్నాం కానీ వేతనాలు పెంచమని గాని బోనసులు ఇవ్వమని గాని డిమాండ్ చేయడం లేదని ప్రజల మధ్య ఉద్యోగులను తక్కువ చేసి చూపడం, తప్పుదోవ పట్టించే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి చర్చల సందర్భంగా హామీ ఇచ్చినట్లుగా ఇకనైనా ఉద్యోగస్తుల పెండింగ్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి సమస్యలపై ఉద్యోగ సంఘాల జేఏసీతో చర్చించడానికి చర్యలు తీసుకోవాలని శంతన్ డిమాండ్ చేశారు. కమిటీ సమావేశానికి అధ్యక్షుత వహించిన జిల్లా అధ్యక్షులు ఎం. బాలయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగాన్ని కుదించే ప్రయత్నాలను మానుకోవాలని ఇప్పుడున్న పాఠశాలలను సమర్థవంతంగా నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని, పర్యవేక్షణ అధికారుల పోస్టులు భర్తీ చేయాలని, ఉపాధ్యాయుల పదోన్నతులు బదిలీలు ఈ వేసవిలో చేపట్టాలని, ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా సిపిఎస్ రద్దుకు చర్యలు చేపట్టాలని, మిగిలిపోయిన 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ జిల్లా కమిటీ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కె. ఒమాజీ, జిల్లా ఉపాధ్యక్షులు పి. దాసు, ఆర్.పెంటన్న కార్యదర్శులు, బి.రాందాస్, షేక్ మదర్, ఏక్ నాథ్, రాష్ట్ర కౌన్సిలర్ పి. విజయ్ కుమార్, ఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
