హైదరాబాద్, బతుకమ్మ :
తుంగభద్ర జలాల్లో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నికర వాటా నీటి వినియోగం కోసం కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. భాగస్వామ్య రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలతో సమన్వయం సాధించి తెలంగాణకు న్యాయమైన వాటా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. జలసౌధలో తుంగభద్ర ప్రాజెక్టు, రాజోలి బండ డైవర్సన్ స్కీమ్ (ఆర్డీఎస్), అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి ఈ అంశాలను ప్రస్తావించారు. ఈ సమావేశంలో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ సలహాదారులు జితేందర్ రెడ్డి, ఆదిత్యనాథ్ దాస్‌తో పాటు నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తుంగభద్ర డ్యామ్, నది ప్రవాహం నుంచి తెలంగాణకు హక్కుగా 15.9 టీఎంసీల నీరు రావాల్సి ఉన్నప్పటికీ ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీలకు మించి అందడం లేదని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్డీఎస్ పరిధిలోని జోగులాంబ గద్వాల జిల్లాలో దాదాపు 75 గ్రామాల పరిధిలో ఉన్న 83,987 ఎకరాల ఆయకట్టుకు తగినంత నీరు అందడం లేదని పేర్కొన్నారు. మూడు రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్న నేపథ్యంలో కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆధ్వర్యంలో తుంగభద్ర బోర్డును మరింత పటిష్టం చేసి, నీటి వాటాల సమర్థ వినియోగానికి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. ఆర్డీఎస్ ఆనకట్ట ప్రస్తుతం ప్రమాదకర స్థితిలో ఉందని, భద్రతాపరమైన అంశాలను అత్యవసరంగా పరిశీలించి అవసరమైన పనులను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. రాజోలి బండ డైవర్సన్ కెనాల్ ఆధునికీకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.59 కోట్లు డిపాజిట్ చేసినప్పటికీ పనులు పూర్తికాలేదని సమావేశంలో చర్చించారు. ప్యాకేజీ-1, ప్యాకేజీ-2 పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, ప్యాకేజీ-3, ప్యాకేజీ-4 పనులు మాత్రమే పూర్తయ్యాయని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నిలిచిపోయిన పనులను వెంటనే ప్రారంభించేలా కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో జరగనున్న మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని నిర్ణయించారు. తెలంగాణ వైపు ఆర్డీఎస్ ప్రాంతంలో భారీగా పూడిక పేరుకుపోవడంతో ఆశించిన స్థాయిలో నీటి మళ్లింపు సాధ్యం కావడం లేదని ఇంజనీర్లు వివరించారు. 2004లో నిపుణుల కమిటీ పూడిక తొలగించాలని సూచించినప్పటికీ ఆ సిఫారసులు ఇప్పటివరకు అమలు కాలేదని సమావేశంలో చర్చించారు. పూడిక తొలగింపు పనులను వెంటనే చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని, పూడిక పేరుకున్న ప్రాంతం కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఉండటంతో ఆ రాష్ట్ర సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించారు. అలాగే 2004 నిపుణుల కమిటీ సూచనల అమలుపై కేంద్రానికి ప్రత్యేక వినతిపత్రం అందించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని నీటిపారుదల శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. తుంగభద్ర ఎత్తిపోతల పథకం ద్వారా సాధ్యమైనంత ఎక్కువ నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని సూచించారు. తుమ్మిళ్ల నుంచి నీటి వినియోగాన్ని పెంచేందుకు కీలకమైన మల్లమ్మకుంట బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచాలని, ఆ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు.

