. . . ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించలేని చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం
. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలను నిలువునా మోసం చేశారని నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్‌పాల్ సూర్యనారాయణ తీవ్రంగా ఆరోపించారు. నగరంలోని 19వ డివిజన్ కంఠేశ్వర్‌లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నాగోల్ల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఐదు సంవత్సరాల్లో బీసీల అభివృద్ధి కోసం రూ. 1,00,000 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి, ఇప్పటివరకు కనీసం రూ.200 కోట్లు కూడా ఖర్చు చేయలేని అసమర్థ ముఖ్యమంత్రి అని విమర్శించారు. ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్‌ను నిలిపివేసి, వారి చదువులను అర్ధాంతరంగా ఆపేసిన ఘనత కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. గత 12 సంవత్సరాలుగా దేశాన్ని ఎలాంటి అవినీతి మచ్చ లేకుండా పాలిస్తున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ అని, అదే విధంగా జిల్లా ఎంపీ అర్వింద్ కూడా తన పదవీకాలంలో అవినీతి మచ్చలేకుండా పనిచేసిన నాయకుడని ఎమ్మెల్యే కొనియాడారు. తాను రెండున్నర సంవత్సరాల పాలనలో ఎక్కడైనా అవినీతి చేశానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద సబ్సిడీ గ్యాస్ అందిస్తున్నది కేంద్ర ప్రభుత్వమేనని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌లో కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉందని తెలిపారు. పేద ప్రజలకు అందుతున్న ఆరు కిలోల రేషన్ బియ్యంలో ఐదు కిలోలు కేంద్ర ప్రభుత్వమే అందిస్తోందని స్పష్టం చేశారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి ముద్ర లోన్ పథకం కింద రూ.2 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణాలు కల్పిస్తున్న ఘనత కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానిదేనని అన్నారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం తామే చేస్తున్నట్లుగా గొప్పలు చెప్పుకోవడం వారి దిగజారిన రాజకీయానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కార్పొరేటర్ అభ్యర్థులకు ప్రజలు మద్దతు ఇచ్చి, ఓటు వేసి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కోరారు.
