ప్రమాద స్థలం పరిశీలన
బాయిలర్లను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా..?
అధికారులు ఊహాజనిత సమాధానాలు చెప్పొద్దు
సంగారెడ్డి, బతుకమ్మ : సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటన స్థలాన్ని మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. అనంతరం పరిశ్రమల శాఖ అధికారులు, మంత్రులతో సమీక్షించారు. ప్రమాదం జరిగిన పరిశ్రమలో పరిశ్రమల శాఖ అధికారులు, బాయిలర్స్ డైరెక్టర్స్ బాయిలర్లను తనిఖీ చేసి ఏమైనా సమస్యలు గుర్తించారా, వాటి పని తీరుపై యాజమాన్యానికి ఏమైనా సూచనలు చేశారా ..? అని ప్రశ్నించారు. అధికారులపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. పరిశ్రమల్లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధ్యయనం చేయాలన్నారు. ఊహాజనిత సమాధానాలు చెప్పవద్దని స్పష్టం చేశారు. ప్రమాద ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్మికులకు బీమా సదుపాయం ఉందా అని అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ప్రమాద సమయాల్లో మానవత్వంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ప్రమాదంపై కంపెనీ యాజమన్యం బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని పరిశ్రమల్లో తనిఖీలు చేయాలని ఆదేశించారు. ప్రమాదం జరిగి 24 గంటలు దాటినా యాజమాన్యం ఘటన స్థలానికి రాకపోవడం బాధకరమని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈఘటనలో మృతుల కుటుంబాలకు రూ. లక్ష, గాయపడిన వారికి రూ.50 వేలు తక్షణ సాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఇచ్చేలా మంత్రులు పరిశ్రమల యాజమానులతో మాట్లాడాలని ఆదేశించారు. తీవ్రగాయాలైన వారికి రూ.10 లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు ఇవ్వాలన్నారు. పరిశ్రమల్లో భద్రతా పై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.
