. . . హైదరాబాద్ మెట్రో ఫేజ్ -2 ను ఆమోదం తెలపాలని వినతి
హైదరాబాద్, బతుకమ్మ :
కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, మెట్రో ఫేజ్ – 3 పై చర్చించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలపాలని సీఎం మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల సౌకర్యార్ధం మెట్రోను మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని అన్నారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2, ఫేజ్-3 విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశ్యంతోనే మెట్రో ఫేజ్-1 ను ఎల్&టి ఎంఆర్హెచ్ఎల్ ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని వివరించారు. ప్రస్తుతం ఫేజ్-1 ప్రభుత్వం పరిధిలో ఉండడంతో ఫేజ్-2, ఫేజ్-3 విస్తరణ సులుభమవుతుందని చెప్పారు. మెట్రో రైలు నెట్‌వర్క్ ను విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫేజ్-2 లో ఏడు కారిడార్లతో మొత్తం 122.9 కిలోమీటర్ల మేర విస్తరణకు, రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర డీపీఆర్‌ను ఇప్పటికే సమర్పించిన విషయాన్ని గుర్తుచేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2 ప్రాజెక్ట్ ను భారత ప్రభుత్వం – తెలంగాణ ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రి ని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఆర్జీఐ ఎయిర్‌పోర్ట్ – భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను మెట్రో ఫేజ్-3 గా చేపట్టాలని కోరారు. మెట్రో ఫేజ్-3 కి సంబంధించిన డీపీఆర్‌ను కూడా ఇప్పటికే సమర్పించామని తెలిపారు. సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కె. శ్రీనివాస్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి బి.అజిత్ రెడ్డి, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (పట్టణ రవాణా) ఎన్.వి.ఎస్.రెడ్డి, ఢిల్లీ తెలంగాణ భవన్ ప్రత్యేకాధికారి సంజయ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.

