27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

చైన్ స్నాచింగ్ ముఠా అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . బంగారం, కారు స్వాధీనం

 

నవీపేట, బతుకమ్మ :

 

నిజామాబాద్ జిల్లాలో బస్టాండ్‌లలో రద్దీని ఆసరాగా చేసుకుని వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని బంగారు గొలుసులు, ఆభరణాలు దొంగతనం చేస్తున్న అంతర్-జిల్లా ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 63 గ్రాముల బంగారం, అలాగే దొంగతనాలకు ఉపయోగించిన మారుతి ఎర్టిగా కారు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసు వివరాలను నిజామాబాద్ డివిజన్ అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ బి. ప్రకాష్ వెల్లడించారు. బస్టాండ్‌లలో బస్సు ఎక్కే సమయంలో మహిళల మెడలోని బంగారు గొలుసులు, పుస్తెలతాడు, గుండ్ల తాడు వంటి ఆభరణాలను కత్తిరించి దొంగతనం చేసి పరారవుతున్నట్లు విచారణలో తేలిందని ఆయన తెలిపారు. దర్యాప్తు నవీపేట్ పోలీస్ స్టేషన్ సబ్ – ఇన్‌స్పెక్టర్ కె. శ్రీకాంత్ నేతృత్వంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ముఠా ఒకే కుటుంబానికి చెందిన సభ్యులతో ఏర్పడి, పథకం ప్రకారం బస్టాండ్‌లను లక్ష్యంగా చేసుకుని వరుస చోరీలకు పాల్పడుతోంది. అరెస్టైన నిందితుల వివరాలు ఇలా ఉన్నాయి: ప్రధాన నిందితురాలు ఖుతీజా బేగం (67), భర్త షేక్ బషీర్, నివాసం నయాబాది, భైంసా. ఆమె కుమార్తె నజ్మా బేగం (29). కుమారుడు షేక్ అన్జద్ (39). అలాగే అబ్దుల్ జుబైర్, షేక్ వసీం అహ్మద్ @ నదీమ్, తహేరా తదితరులు ఈ ముఠాలో సభ్యులుగా ఉన్నారు. వీరందరూ కలిసి వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల స్వాధీనంలోకి వచ్చిన సొత్తులో ఖుతీజా బేగం వద్ద నుంచి 20 గ్రాముల బంగారు నెక్లెస్, నజ్మా బేగం వద్ద నుంచి 15 గ్రాముల బంగారు చైన్ మరియు 8 గ్రాముల బంగారు కమ్మలు, షేక్ అంజద్ వద్ద నుంచి 20 గ్రాముల బంగారు గుండ్ల తాడు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం సుమారు 63 గ్రాముల బంగారం విలువ దాదాపు రూ.10 లక్షలుగా అంచనా వేశారు. అదనంగా దొంగతనాలకు ఉపయోగించిన ఎర్టిగా కారు (నెంబర్ టీఎస్ 16 ఈయు 9404) కూడా స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితులు నిజామాబాద్, నందిపేట, నవీపేట్ ప్రాంతాల్లో జరిగిన పలు కేసుల్లో తమ పాత్రను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. తాజాగా దొంగిలించిన బంగారం అమ్మేందుకు నిజామాబాద్‌కు వస్తుండగా పోలీసులు ముందస్తు సమాచారం ఆధారంగా వీరిని పట్టుకున్నట్లు తెలిపారు. సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఈ ఆపరేషన్ నిర్వహించబడింది. ఈ కేసు చేధనలో పాల్గొన్న పోలీస్ బృందాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అభినందించారు. ప్రజలు బస్టాండ్‌లు, రద్దీ ప్రదేశాల్లో అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.

 

Chain-snatching gang arrested

More articles

Latest article