25.9 C
Hyderabad
Sunday, August 2, 2026

ఏర్గట్లలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

 

ఏర్గట్ల, బతుకమ్మ :

 

ఏర్గట్ల పరిధిలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు సంబంధించిన కేసును పోలీసులు నమోదు చేశారు. డిప్యూటీ తహసీల్దార్ (సివిల్ సప్లైస్) వి. పవన్ కుమార్ ఫిర్యాదు మేరకు, ఏర్గట్ల పోలీస్ స్టేషన్‌లో సీఆర్.నెం. 29/2026గా కేసు నమోదైంది. టాస్క్ ఫోర్స్ అధికారుల విశ్వసనీయ సమాచారం ఆధారంగా, 2026 ఏప్రిల్ 28 అర్ధరాత్రి సమయంలో టీఎస్16 యుడి 3297 నంబర్ గల గూడ్స్ వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు. ఆ వాహనంలో మొత్తం 77 పీడీఎస్ బియ్యం సంచులు ఉన్నట్లు గుర్తించారు. ఈ సంచులు తాడ్లరాంపూర్ గ్రామంలోని శ్రీ రామ రైస్ ఇండస్ట్రీస్ ప్రాంగణంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వర్ణి డిప్యూటీ తహసీల్దార్ (సివిల్ సప్లైస్) సంఘటనా స్థలానికి చేరుకుని, టాస్క్ ఫోర్స్, పోలీసుల సమక్షంలో రైస్ మిల్ వెయింగ్ బ్రిడ్జ్ వద్ద బియ్యాన్ని తూకం వేయించారు. మొత్తం 43.90 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం బియ్యాన్ని మోర్తాద్ ఎంఎల్ఎస్ పాయింట్‌కు తరలించి భద్రపరిచారు. తరువాతి రోజు అధికారులు తాడ్లరాంపూర్ గ్రామానికి చేరుకుని, స్వతంత్ర పంచుల సమక్షంలో మోర్తాద్ ఎంఎల్ఎస్ పాయింట్‌లో భద్రపరిచిన బియ్యానికి నమూనాలు సేకరించారు. అలాగే రైస్ మిల్లులో ఉన్న బియ్యం కుప్పల నుండి కూడా యాదృచ్ఛికంగా నమూనాలు తీసుకుని ప్రయోగశాలకు పంపించారు. రైస్ మిల్ యజమాని వాగ రవీందర్ రెడ్డి విచారణలో మాట్లాడుతూ, వాహనం తూకం కోసం మాత్రమే మిల్లులోకి వచ్చిందని, పోలీసులు రావడంతో డ్రైవర్ భయపడి దాక్కున్నాడని తెలిపాడు. ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని పేర్కొన్నాడు. అయితే వాహన డ్రైవర్ షేక్ షకీల్ ఇచ్చిన ప్రకటనలో, ఏర్గట్ల పరిసర గ్రామాల్లోని రేషన్ కార్డు దారుల వద్ద నుండి కిలోకు రూ.16 చొప్పున పీడీఎస్ బియ్యం కొనుగోలు చేసి, వలస కార్మికులకు కిలోకు రూ.20కి విక్రయించాలనే ఉద్దేశంతో తరలిస్తున్నట్లు అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. రైస్ మిల్ యజమాని, డ్రైవర్ ఇచ్చిన వివరణలు నమ్మశక్యం కాకపోవడంతో, వారు గుప్తంగా పీడీఎస్ బియ్యం వ్యాపారం నిర్వహిస్తున్నట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. టీపీడీఎస్ (కంట్రోల్) ఆర్డర్ 2016 లోని క్లాజ్ 17(ఈ) ప్రకారం పీడీఎస్ బియ్యం కొనుగోలు, అమ్మకం నేరంగా పరిగణించబడుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 318(హెచ్), ఎస్సెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సెక్షన్ 7, టీపీడీఎస్ యాక్ట్ సెక్షన్ 17(ఈ) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అలాగే టీఎస్16 యుడి 3297 వాహనాన్ని స్వాధీనం చేసుకుని, కలెక్టర్ (సివిల్ సప్లైస్), నిజామాబాద్ ఆదేశాల వరకు భద్రపరచాలని నిర్ణయించారు.

More articles

Latest article