37 తులాల బంగారు ఆభరణాలు, నగదు అపహరణ
కామారెడ్డి క్రైం, బతుకమ్మ : తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన ఘటన కామారెడ్డి పట్టణంలోని పీఎంహెచ్ కాలనీలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం పీఎంహెచ్ కాలనీలో నివసించే అర్నె యోగేష్ కుటుంబంతో సహా సోమవారం తన ఇంటికి తాళం వేసి వరంగల్ వెళ్లారు. మంగళవారం సాయంత్రం తెలిసిన బంధువులు ఇంటి తాళాలు పగుల గొట్టి తలుపులు తెరిచి ఉన్నాయని యోగేష్ కు సమాచారం అందించారు. దీంతో రాత్రికి వచ్చి చూసుకున్నారు. బుధవారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంటిలో ఉన్న దాదాపు 37 తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు ఎత్తుకెళ్లారని ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సంఘటన స్థలానికి కామారెడ్డి ఎస్డిపిఓ నాగేశ్వరరావు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిసిఎస్ సిబ్బంది, కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాలు, పాత నేరస్తుల గురించి మూడు బృందాలుగా విడిపోయి నేరస్తుని పట్టుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటికి వేసిన తాళం, గేటుకు వేసిన తాళము బయటకు కనపడే విధంగా కాకుండా, కనబడకుండావేరొక సైడు వేయాలని, విలువైన ఆభరణాలు, నగదును లాకర్లలో భద్రపరుచుకోవాల్సిందిగా ప్రజలను కోరారు.
