. . . కాంగ్రెస్ అనుబంధ సంస్థగా మారిన పోలీసు శాఖ
. . . బీఆర్ఎస్ అభ్యర్థులకు క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా పోలీసుల కొర్రీలు
. . . కాంగ్రెస్ లో చేరమని బీఆర్ఎస్ నేత లకు బెదిరింపులు
. . . పోలీసుల తీరును నిరసిస్తూ ఆర్మూర్ ఏసీపీ ఆఫీసు ఎదుట ధర్నా
ఆర్మూర్, బతుకమ్మ :
మున్సిపల్ ఎన్నికల్లో ఎలాగైనా బీఆర్ఎస్ గెలుపు ను అడ్డుకోవాలని ఆర్మూర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పోలీసులను అడ్డుపెట్టుకొని యధేచ్చగా అరాచక కాండకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు. పోలీసుల వక్రనీతిని నిరసిస్తూ గురువారం జీవన్ రెడ్డి వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ఆర్మూర్ ఏసీపీ ఆఫీస్ ఎదుట ధర్నా చేశారు. బీఆర్ఎస్ తరపున కౌన్సిలర్ అభ్యర్థులుగా పోటీ చేయనున్న నేతలకు పోలీసులు క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వకపోగా కాంగ్రెస్ పార్టీలో చేరమని ఒత్తిడి చేయడం దారుణమని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఏసీపీతో మాట్లాడి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలే టార్గెట్ గా ఖద్దరు నేతలు, ఖాకీలు కలిసి అణచి వేత చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసు శాఖ కాంగ్రెస్ కు అనుబంధ సంస్థగా మారిందని ఆయనన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులకు క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా పోలీసుల కొర్రీలు పెట్టడం, కాంగ్రెస్ లో చేరమని బీఆర్ఎస్ నేతలను బెదిరించడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. ఇది ఇందిరమ్మ రాజ్యమా , ఇందిరమ్మ ఎమర్జెన్సీ రాజ్యమా అని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి వినయ్ రెడ్డి ఒక స్టూవర్ట్ పురం దొంగల ముఠా లీడర్ అని ఆయన మండిపడ్డారు. పైసా వసూలు రెడ్డిగా మారిన వినయ్ రెడ్డి 30 మందితో దొంగల ముఠాను ఏర్పాటు చేసుకొని కమిషన్లు , సెటిల్ మెంట్లతో దోచుకుతింటూ ఆర్మూర్ ను ఆగం చేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తాను పదేళ్లలో తీర్చిదిద్దిన ఆర్మూర్ నేడు తన కళ్లెదుటే అనాధగా మారి కన్నీరు పెడుతుంటే గుండె తరుక్కు పోతోందని జీవన్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. కాంగ్రెస్ నేతల అరాచకాలపై స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని ఆయన నిలదీశారు. నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ , బీజేపీలది అక్రమ సంబంధమని ఢిల్లీలో కయ్యం, గల్లీలో వియ్యం అన్నట్లుగా ఉన్న ఈ రెండు జాతీయ పార్టీలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇంఛార్జి వినయ్ రెడ్డి, ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎంపీ అర్వింద్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి లు కుమ్మక్కయ్యారని ఆయనన్నారు. ఈ రెండు పార్టీల తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. తమది పార్టీలను ఒప్పించి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ సైన్యమని ఆయన వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ అంటే 500 కేవి పవర్ సబ్ స్టేషన్ అని, ముట్టు కుంటే మాడి మసై పోతారు తస్మాత్ జాగ్రత్తని జీవన్ రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడినందుకు లగడపాటి రాజగోపాల్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలను, ఆర్మూర్ వచ్చిన రోజాను, తెలంగాణ పొలిమేరలు దాటే వరకు తరిమికొట్టిన ఉద్యమ చరిత్ర తమదన్నారు. కేసీఆర్ సైన్యం ఎవరికైనా భయపడుతోందా? అని ప్రశ్నించారు. తెలంగాణ గడ్డ మీద అణిచివేత ఏ స్థాయి లో ఉంటే అంతకు రెట్టించిన వేగంతో నిరసన ఉబికి వస్తుందనే విషయాన్ని గుర్తించాలని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇంతటి దారుణమైన నిర్బంధాలను చూడలేదన్నారు. ఇకనైనా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీకి దిగే బీఆర్ఎస్ నేతలకు క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఇవ్వాలని, పోలీసుల బెదిరింపులు ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఆర్మూర్ లో కాంగ్రెస్ పోలీసుల దాస్టీకాల గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు వివరించానని, లీగల్ టీమ్ తో మాట్లాడి న్యాయ పోరాటం చేద్దామని హామీ ఇచ్చారన్నారు. తన ప్రాణాలను అడ్డు పెట్టైనా బీఆర్ఎస్ కార్యకర్తలను కాపాడుకుంటానన్నారు. పోలీసుల తీరు మారకుంటే నిజామాబాద్ లో ఎన్నికల కమిషన్ ఆఫీసును , ఆర్మూర్ లో ఏసీపీ కార్యాలయాన్ని 10 వేల మందితో ముట్టడిస్తానని జీవన్ రెడ్డి హెచ్చరించారు.

