- రిజర్వు ఫారెస్టు అని అంటున్న అధికారులు
- ఇందిరమ్మ ఇళ్లకు ప్రొసీడింగ్ లు ఇచ్చినా రెవెన్యూ అధికారులు
- నిర్మాణాన్ని అడ్డుకుంటున్న అటవీ శాఖ
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని సారంగాపూర్ రిజర్వు ఫారెస్టు ప్రాంతంను ఆనుకుని ఉన్న 2148 సర్వే నంబర్ లో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు అటవి శాఖ బ్రేక్ లు వేస్తుంది. నగరంలోని 13వ డివిజన్ అసద్ బాబానగర్ ను ఆనుకుని ఉన్న సంబంధిత సర్వే నంబర్ లో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్ళ నిర్మాణానికి ఇందిరమ్మ ఇళ్ల ప్రోసిడింగ్ లను జారీ చేసింది. ఆయా స్థలాల్లో పేదలు ఇళ్ళు కట్టుకునేందుకు యత్నించగా అటవి శాఖాధికారులు అది రిజర్వు ఫారెస్టు సర్వే నంబర్ 2164 సంబంధించిన స్థలమని, అందులో నిర్మాణాలకు అనుమతించేది లేదని ఖరాఖండిగా తేల్చేశారు. సంబంధిత స్థలం ప్రైవేట్ దని, వెంచర్ స్థలమని లబ్దిదారులు చెబుతుండగా సంబంధిత స్థలం అటవీశాఖ పరిధిలోనిదని అధికారులు వాదిస్తున్నారు.

ఇటీవల మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ళు మంజూరైన వారు నిర్మాణానికి సిద్దం కావడంతో అటవి శాఖాధికారులు అడ్డుకున్నారు. అటవి శాఖాధికారులు 2148 సర్వే నంబర్ లోని భూమి వివరాల కోసం కొందరు 2021లో సహ చట్టం కింద దరఖాస్తు చేయగా అది రిజర్వు ఫారెస్టు ఏరియా కాదని సమాచారం ఇవ్వడం విశేషం. 2148 సర్వే నంబర్ లో ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి 19 ఎకరాల్లో దశాబ్ధాల క్రితం వెంచర్ ను ఏర్పాటు చేసి తక్కువ ధర అని పేదలకు అంటగట్టారు. ఇప్పుడు అక్కడ ఇళ్ళు కట్టుకుంటే మాత్రం రెవెన్యూ, అటవి శాఖాధికారులు జాయింట్ సర్వే చేస్తే కానీ వివరాలు వెల్లడించలేమని చెబుతున్నారు. అటవి శాఖ ఒకవైపు అడ్డుకుంటుంటే ఇందిరమ్మ ఇళ్ళ ప్రోసిడింగ్ లు పొందిన లబ్దిదారులు నిర్మాణాలకు సిద్దమౌతుండడం వివాదాస్పదమౌతుంది.

ఇటీవల కాలంలో 2148 సర్వే నంబర్ ను ఆనుకుని ప్రైవేట్, 2164 సర్వే నంబర్ లో అటవి భూమి మధ్య జరిగిన వివాదం సద్దుమనుగకముందే కొత్త వివాదం తెరపైకి వచ్చింది. నగర శివారులోని నాగారం, దొడ్డికొమురయ్యకాలనీ, బీడీ వర్కర్స్ కాలనీ, అసద్ బాబానగర్, పెయింటర్స్ కాలనీ, డ్రైవర్స్ కాలనీలలో ప్రభుత్వ, అసైన్డ్ భూములున్నాయి. వాటిని ఆనుకుని ఉన్న ప్రైవేట్ పట్టా భూములను దశాబ్ధాల క్రితమే వెంచర్లు చేసి అమ్ముకున్న కొందరు వాటికి అదనంగా కొత్తగా వార్డ్ బ్లాక్, ఇంటి నంబర్లతో (సెల్ప్ అసిస్ మెంట్) నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేసి పేదలను మోసం చేశారు. పేదలు ఇప్పుడు ఇళ్ళు కట్టుకుంటామంటే అటవి శాఖాధికారులు కొర్రీలు పెట్టడంతో లబోదిబోమంటున్నారు.

- జాయింట్ సర్వే నిర్వహించిన తర్వాతనే నిర్మాణాలు చేపట్టాలి : నార్త్ ఎఫ్ఆర్ వో సంజయ్ గౌడ్
నగరంలోని సారంగాపూర్ రిజర్వు ఫారెస్టును ఆనుకుని ఇటీవల కొందరు ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిసింది. అక్కడ 2148 సర్వే నంబర్ అని చెబుతున్నప్పటికీ సంబంధిత భూమి 2164 అటవి రిజర్వు ప్రాంతానికి చెందినదిగా గుర్తించడం జరిగింది. ఈ విషయంలో అటవి, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే అనంతరమే నిర్మాణాలు చేపట్టాలని సూచించాం.

- 2148 సర్వే నంబర్ పట్టా భూమే : దక్షిణ మండల తహసీల్ధార్ బాల్ రాజ్
నగరంలోని అసద్ బాబానగర్ శివారులో 2148లో ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణాలకు ప్రోసిడింగ్ ఇచ్చిన భూమి పట్టా భూమి. అందులో అటవి శాఖకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే బాధితులు ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు తీసుకుంటాం.


