బతుకమ్మ, బోధన్ : నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో ఆదివారం మున్నూరు కాపు, ఆధ్వర్యంలో బోనాల పండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరిపారు. తెలుగు సంప్రదాయ సంస్కృతుల పరంపరను ప్రతిబింబించేలా, ఈ పండుగ గ్రామీణ జీవనశైలిలోని ఆధ్యాత్మికత, సామాజిక ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. ఉత్సవంలో మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో అలంకరించుకొని, శోభాయమానమైన బోనాలతో తమ నివాసాల నుంచి ఊరేగింపుగా బయలుదేరి డప్పు వాయిద్యాల మధ్య మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుల సంఘ నాయకులు మాట్లాడుతూ, “ఈ బోనాల పండుగ ప్రతి ఏడూ జేష్ట, ఆషాడ మాస, ఆరీద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని నిర్వహించబడుతుంది. ఇది మా పూర్వీకుల నుండి సంక్రమించిన సంప్రదాయం. రైతులకు పంటలు బాగా పండాలని, పశుపక్ష్యాదులు ఆరోగ్యంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ వేడుకలు నిర్వహిస్తాం” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘ నాయకులు బీర్కూర్ బుజ్జి ,గమరపేట శ్రీను,శంకర్,కమల భూమేష్ ,సురేందర్ ,సాయన్న, వీరేందర్, అజయ్, రాజు ,శేఖర్, నంద్యాల శ్యామ్, సింగం లక్ష్మణ్ ,నర్సారెడ్డి రమేష్ మహిళలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై పండుగ వేడుకలకు ఘనంగా నిర్వహించారు.

