. . . 15 మంది తెలుగు వారు గల్లంతు
. . . కంట్రోల్ రూం ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
వెబ్ డెస్క్, బతుకమ్మ :
వియత్నాంలోని ప్రసిద్ద పర్యాటక ప్రాంతమైన ఫూ క్వాక్ ఐలాండ్ సమీపంలో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పలువురు భారతీయ పర్యాటకులతో వెళ్తున్న బోటు సముద్రంలో ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది భారతీయులు మరణించినట్టు తెలుస్తోంది. చని పోయిన వారిలో ఏపీ, తెలంగాణకు చెందిన టూరిస్టులు ఉన్నట్టు సమాచారం. కడపకు చెందిన శ్రీధర్, మచిలీ పట్నానికి చెందిన జయశ్రీ, కాకినాడకు చెందిన మరో యువకుడు మరణించగా, ఏపీకి చెందిన మరో నలుగురు గల్లంతైనట్టు సమాచారం. స్థానిక రెస్క్యూ సిబ్బంది రంగంలోకి దిగి గల్లంతైన వారి కోసం గాలిస్తున్నారు. రెస్క్యూ సిబ్బంది పలువురిని రక్షించగా వారి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు.
. . . విహార యాత్ర కోసం వెళ్లగా
ప్రముఖ సెల్ ఫోన్ కంపెనీ తమ డిస్ట్రిబ్యూటర్లకు ఏర్పాటు చేసిన విహార యాత్రలో భాగంగానే వారంతా వియత్నాం వెళ్లినట్టు సమాచారం. మొత్తం 250 మంది భారతీయులు టూర్ కు తీసుకెళ్లగా వారిలో ఏపీకి చెందిన వారు 35 మంది, తెలంగాణకు చెందిన వారు 45 మంది ఉన్నట్టు తెలుస్తోంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం ప్రమాదం జరిగిన సమయంలో ఆన్ థోయ్ సముద్ర ప్రాంతంలో అలలు తీవ్రంగా ఉన్నాయని, వర్షం లేకపోయినప్పటికీ సముద్రం అల్లకల్లోలంగా ఉందని పేర్కొంది.

. . . ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు
ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా స్పందించింది. బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకు హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్ లో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని పేర్కొంది. బాధిత కుటుంబ సభ్యులు హో చి మిన్ సిటీ కంట్రోల్ రూం +84362817930, +84915523714, +84334520414, హనోయ్ కంట్రోల్ రూం +84913089165 నంబర్ లను సంప్రదిచ్చవచ్చని తెలిపింది.
. . . దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం
వియత్నాం పర్యటనకు వెళ్లిన తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు పర్యాటకులు అక్కడ బోటు ప్రమాదంలో మరణించారనే సమాచారంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వియత్నాంలోని ఫూ క్వాక్ ద్వీపంలో పర్యటనకు వెళ్లిన భారతీయులు బోటు ప్రమాదంలో మరణించారన్న సమాచారంపై ముఖ్యమంత్రి వెంటనే అధికారులను అప్రమత్తం చేశారు. ప్రమాద వివరాలను తెలుసుకోవడంతో పాటు సహాయక చర్యలను ముమ్మరం చేయడంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖతో పాటు వియత్నాంలోని భారతీయ ఎంబసీ కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని ఆదేశించారు. ఈ ప్రమాదంలో తెలుగువారు ఉన్నారని ప్రాథమిక సమాచారం అందిన నేపథ్యంలో పూర్తి సమాచారం తీసుకోవాలని, ఈ ఘటనలో క్షతగాత్రులకు అవసరమైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. బాధితులకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి తెలిపారు.

