. తలకిందులైన కాంగ్రెస్ అంచనాలు
. గట్టిపోటీనిచ్చిన బీఎస్పీ అభ్యర్థి
నిజామాబాద్, బతుకమ్మ: రెండు ప్రాధాన జాతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ హోరాహోరీగా సాగింది. చివరకు బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి వూట్కూరి నరేందర్ రెడ్డిపై సుమారు 5వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఫలితం కాంగ్రెస్ కు షాక్ అనే చెప్పొచ్చు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ట్మాతకంగా తీసుకుంది. సీఎం రేవంత్, పీసీసీ చీఫ్ మహేశ్, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచారం చేసినా నిరాశే మిగిలింది.
పట్టించుకోని పట్టభద్రులు
ఉద్యోగాల భర్తీ, సంక్షేమ పథకాల అమలు అంశాలే తమను గట్టెక్కిస్తాయని నమ్మకంతో ఉన్న కాంగ్రెస్ పరాజయాన్ని మూటగట్టుకుంది. గ్రౌండ్ లెవల్ లో పని చేసే వారు లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉద్యోగాల భర్తీ, నియామకపత్రాల అందజేత, నోటిఫికేషన్ ల జారీని పట్టభద్రులు పట్టించుకోలేదని ఆ పార్టీ నాయకులే అంటున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది.
ముగ్గురూ కాంగ్రెస్ టికెట్ ఆశించిన వారే..
వూట్కూరి నరేందర్ రెడ్డి, చిన్నమైల్ అంజిరెడ్డి, ప్రసన్న హరిక్రిష్ణ ముందు నుంచీ కాంగ్రెస్ టికెట్ ను ఆశించారు. రెండు అగ్రవర్ణాలకు చెందిన వారు కాగా హరిక్రిష్ణ బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ఎవరికి వారే కాంగ్రెస్ టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. తమకు టికెట్ దక్కదని ఒక అవగాహనకు వచ్చిన అంజిరెడ్డి బీజేపీ నుంచి బరిలోకి దిగగా, స్వతంత్రంగా పోటీ చేయాలనుకున్న ప్రసన్న హరిక్రిష్ణ బీఎస్పీ తరఫున బరిలోకి దిగారు. చివరకు అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేతకు కాంగ్రెస్ టికెట్ దక్కింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగపడిన వారి మధ్యే పోటీ నెలకొంది.
వూట్కూరి పుట్టిముంచిన చెల్లని ఓట్లు
2,52,029 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా.. అందులో 28,686 ఓట్లు చెల్లకుండాపోయాయి. వాటిలో నుంచి కనీసం 10వేల ఓట్లు నరేందర్ రెడ్డికి పడిన తొలి ప్రాధాన్యత ఓట్లు ఉండి ఉంటాయని రాజకీయ నాయకులు అంచనా వేస్తున్నారు. చాలా మంది పట్టభద్రులకు ఓటు వేయడంపై అవగాహన లేకపోవడంతో 01 అని లేదా 1 నంబర్ కు రౌండప్ చేశారు. చెల్లని ఓట్లను కౌంటింగ్ సిబ్బంది వేరు చేస్తున్న క్రమంలోనే నరేందర్ రెడ్డి 01 అని వేసిన ఓట్లను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను అభ్యర్థించారు. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.
